ప్రజాశక్తి - భీమునిపట్నం (విశాఖపట్నం) : తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రముఖ రచయిత ఆచార్య వెలమల సిమ్మన్న రచించిన వందో గ్రంథం ‘అభినవ విమర్శకు మార్గదర్శి కట్టమంచి’ పుస్తకాన్ని శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. భీమిలి బీచ్ రోడ్డు తిమ్మాపురంలోని విజ్ఞాన్ వరల్డ్ వన్ స్కూల్ వేదికగా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తెలుగు భాష, సంస్కృతి గొప్పతనాన్ని వివరించారు. ప్రస్తుత తరంలో మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుల్ వంటి పిలుపులు ఎక్కువగా వినిపిస్తున్నాయని, వాటికి బదులుగా మన సంస్కృతిని, కుటుంబ అనుబంధాలను ప్రతిబింబించే అమ్మ, నాన్న, పిన్ని, అక్క, బావ, అన్న వంటి తెలుగు పిలుపులను ఉపయోగించడం ఎంతో మంచిదని అన్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుండి కష్టపడడమే కాకుండా ఇష్టపడి చదివితే ఏదైనా సాధించగలరని తెలిపారు. ఆంధ్ర విశ్వ కళాపరిషత్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం కావడానికి డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి చేసిన సేవలు అమోఘం, అద్వితీయమని కొనియాడారు. ఆయన ముసలమ్మ మరణం, నవయామిని కవితత్త్వ విచారం, అర్థశాస్త్రం, పంచమి, వ్యాస మంజరి మొదలైన గ్రంథాలు రాసి ఆధునిక యుగానికి యుగ పురుషుడయ్యారని కొనియాడారు. తెలుగు సాహిత్య విమర్శకు ప్రథమ ఆచార్యులు ఆయనేనని తెలిపారు. సిమ్మన్న రాసిన తాజా గ్రంథం భావితరాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. సభాధ్యక్షులు సాహితీవేత్త ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ సిమ్మన్న గ్రంథాలు వివిధ పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో ఎయు తెలుగు శాఖాధిపతి ఆచార్య జెర్రా అప్పారావు, విజ్ఞాన్ విద్యాసంస్థల సిఇఒ శ్రీకాంత్, ప్రిన్సిపల్ పూర్ణిమ, శతాబ్ది గ్రంథకర్త ఆచార్య వెలమల సిమ్మన్న, విశాఖ సాహిత్య, భాషా అభిమానులు, విద్యార్థులు పాల్గొన్నారు.
‘అభినవ విమర్శకు మార్గదర్శి కట్టమంచి’ పుస్తకావిష్కరణ
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 12:55 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)