సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మహానదిలో మద్యం సీసాలు - పోటీపడ్డారు ప్రజలు ..!

1 గంట క్రితం

Liquor bottles in the Mahanadi River – people scrambled for them!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 11:22 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

రాయ్‌పూర్ (ఛత్తీస్ గడ్) : ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా నదులు ఉప్పొంగుతున్నాయి. గత రెండు రోజుల్లో దాదాపు 5 వేల మంది ప్రజలను అధికారులు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 16 మందిని హెలికాప్టర్ల సాయంతో ఆదుకున్నారు. ధంతరీ జిల్లాలో మహానది నీటిమట్టం పెరిగి ఓ మద్యం దుకాణం నీటమునిగింది. ఆ దుకాణంలోని మద్యం సీసాలన్నీ వరద ప్రవాహంలో కొట్టుకుపోగా.. స్థానిక వంతెన మీదకు చేరిన జనం వెదురుకర్రలకు చీరలు కట్టి, వలలు విసిరి మద్యం సీసాలను పట్టుకునేందుకు నానా యాతనలు పడ్డారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.


మహానది వరదల మధ్య... నది ఉధృత ప్రవాహంతో ప్లాస్టిక్ సీసాలలో నింపిన మద్యం కొట్టుకుపోతోందన్న వార్త తెలియగానే, ప్రజలు సోమవారి బజార్ వంతెనపై గుమిగూడటం ప్రారంభించారు. రాయ్‌పూర్, ధమతారి జిల్లాలను కలిపే ఈ వంతెనపై పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. అందరూ ప్రవహిస్తున్న నదిపైనే కన్నేసి ఉంచారు. ఒక సీసా కనిపించగానే, దాన్ని పట్టుకోవడానికి ప్రజలు పోటీపడ్డారు. మరోవైపు మహానది ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ మద్యం సీసాలు పట్టుకోవాలనే ఆశతో చాలా మంది నదికి, వంతెనకు చాలా దగ్గరగా వెళ్లారు. అధికారులు పదేపదే హెచ్చరించినప్పటికీ, ప్రజలు భద్రతను నిర్లక్ష్యం చేసి ప్రమాదకరంగా ప్రవర్తించారు. వరదల సమయంలో నది లోతును, ప్రవాహాన్ని అంచనా వేయడం అసాధ్యం. అటువంటి పరిస్థితిలో, బలమైన ప్రవాహం మధ్య ఇలాంటి సాహసం చేయడం ఒక పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చునని అధికారులు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా మహానది నీటిమట్టం గణనీయంగా పెరిగింది. ఈ సమయంలో నదులు, వాగులు, వంతెనలు, వేగంగా ప్రవహించే నీటి ప్రవాహాలున్న ప్రాంతాల్లో ప్రయాణించడం ప్రమాదకరమని అధికారులు తెలిపారు. ప్రజలు సురక్షిత దూరం పాటించాలని, వరద నీటిలోకి దిగడం లేదా నీటిపై తేలుతున్న వస్తువులను పట్టుకోవడం వంటి ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండాలని విజ్క్షప్తి చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్