- ఉత్తర భారత కార్మికులకు సంఘీభావం
- బ్యాంకు ఆర్టీసీ ఉద్యోగుల పోరాటానికి మద్దతు
- సిఐటియు జిల్లా కమిటీ నిర్ణయం
ప్రజాశక్తి -భీమవరం : భీమవరం యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో సిఐటియు జిల్లా కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు కె నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు , కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు చేశారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, లేబర్ కోడ్లు రద్దు, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్, టెండర్ విధానం రద్దు కోసం చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. కనీస వేతనాల కోసం రోడ్డు ఎక్కిన ఉత్తర భారతదేశం కార్మికులకు సంఘీభావం, బ్యాంకు, ఆర్టీసీ ఉద్యోగుల పోరాటానికి మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాజా రామ్మోహన్ రాయ్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 12 ఏళ్ల కాలంలో ఉద్యోగులు కార్మికుల వ్యతిరేక విధానాలు అవలంబించిందని అన్నారు. లేబర్ కోడ్లు, ప్రైవేటీకరణ కార్మికులపై బలవంతాన రుద్ది కార్మికులను కష్టాలు పాలు చేసిందన్నారు.. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యోగులు కార్మికులు అన్ని రాష్ట్రాలలో ఉద్యమాలు చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో సిఐటియు దేశవ్యాప్తంగా డిసెంబర్లో చలో ఢిల్లీ కార్యక్రమం పిలుపునిచ్చిందన్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, చతిస్గడ్ రాష్ట్రాలలో కనీస వేతనాల కోసం ఆందోళన చేస్తున్న కార్మికులపై పాలకులు ఉక్కు పాదం మోపుతున్నారన్నారు. ఆయా రాష్ట్రాల కార్మిక వర్గానికి సంఘీభావం పెరుగుతుందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఆందోళనకు దిగివచ్చిన ప్రభుత్వం వారితో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. బ్యాంకు, ఆర్టీసీ ఉద్యోగులు చేపడుతున్న ఆందోళనకు సిఐటియు సంపూర్ణ మద్దతును తెలియజేస్తుందన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి వాసుదేవరావు మాట్లాడుతూ రానున్న కాలంలో జిల్లా ఉద్యోగ,కార్మిక వర్గానికి సిఐటియు మరింత అండగా ఉంటుందని ఉధృతమైన పోరాటాలు నిర్వహిస్తామన్నారు. రైస్ మిల్ కార్మికులు, బజారు జట్టు కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, గ్రామపంచాయతీ కార్మికులు మరిన్ని విస్తృత పోరాటాలు నిర్వహించేందుకు జిల్లా కమిటీ చర్చించిందన్నారు. పి.వి ప్రతాప్, కే ఝాన్సీ లక్ష్మి, సిహెచ్ లక్ష్మి, డి కళ్యాణి, ఎస్ వెంకటేశ్వరరావు, ఎం ఆంజనేయులు, తెలగంశెట్టి సత్యనారాయణ, కే రామకృష్ణ, ఎండి హసీనా, జి రామకృష్ణ, ఎస్ రంగారావు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)