గురువారం, 10 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రేట్ పేయర్స్ పై ఇంటి పన్నుభారాలు తగ్గించాలి

1 గంట క్రితం

kakinada-1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 04:15 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

-ఎన్నికల హామీ అమలు చేయాలి

- కోటిసంతకాలతో పౌరవినతిపత్రం

ప్రజాశక్తి-కాకినాడ : ఆదాయాలు పెరగడం లేదు.. ఇంటి పన్నుల భారం మాత్రం పెరుగుతోంది. ఆస్తి విలువ, రిజిస్ట్రేషన్‌ భూమి ధరల ఆధారంగా ఏటా 15 శాతం చొప్పున పన్నులు పెంచడంతో ఐదేళ్లలో పన్ను భారం భారీగా పెరిగిందని రేట్‌ పేయర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై పౌర సంక్షేమ సంఘం గురువారం సమీక్ష నిర్వహించింది. సూర్యారావు పేట జవహర్ వీధి వివేకానంద పార్కు వద్ద రేట్ పేయర్స్ సమావేశం సీనియర్ సిటిజన్ గరికపాటి రామారావు అధ్యక్షతన జరిగింది. ఇంటి పన్నులను నియంత్రణ చేస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని నాగిరెడ్డి, వెంకటకృష్ణ, పడాల వీరభద్రరావు, మారిశెట్టి నాగ భూషణం, అమజాల సత్యనారాయణ, పట్నాల వీర రాఘవులు కోరారు. స్థానిక ఎన్నికలు వస్తున్న దృష్ట్యా ముందుగానే కూటమి ప్రభుత్వం రేట్ పేయర్స్ వెతలు పరిష్కారం చేయాలని గ్రంధి బాబ్జీ ప్రతిపాదన చేయగా కమిటీ తీర్మానం చేసింది. కోటి సంతకాల సేకరణ చేపట్టి రేట్ పేయర్స్ సమాఖ్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కి వినతి పత్రం ఇవ్వాలని మోహిద్దీన్ సులేమాన్, అన్నంనీడి ఏసుప్రసాద్, పాకల పాటి ముత్యం కార్యాచరణ రూపొందించారు. పన్నుల విధింపులో పలు తేడాలున్నాయని, అధిక అద్దె ఆదాయం వున్న ప్రధాన రహదారిలోని ఆస్తికి, లోపలి సందులలో వున్న ఆస్తికి ఒకే భూమి ధర నిర్ణయించడమేమిటని ప్రశ్నించారు. దీంతో ఆదాయం లేకుండా భారీగా పన్ను చెల్లించాల్సి వస్తోందన్నారు.

మున్సిపల్ చట్ట సవరణ చేసి రిజిష్ట్రార్ భూమి ధరల్లో సబ్ కేటగిరీ ఏర్పాటు చేసి ఇంటి పన్ను మదింపు చేయాలన్నారు.


కలెక్టరేట్, పోలీస్, రెవిన్యూ, ఆర్టిసి, ఆర్‌ అండ్ బీ, విద్య, వైద్య, ఫిషరీస్, ఫైర్, ఎక్సైజ్, మెడికల్, ఎండోమెంట్స్, పంచాయతీ రాజ్, రైల్వే, సాల్ట్ మున్నగు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భవనాలకు ఆస్తి విలువ ఆధారిత మున్సిపల్ పన్ను విధించ లేదన్నారు. వీటి మొండి బకాయిలు 2002 నుండి రూ.44 కోట్లు పెరిగినా సంబంధిత శాఖలు విడుదల చేయడం లేదన్నారు. కార్పొరేషన్ వసూలు చేసే కఠిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. కేవలం సామాన్య మధ్య తరగతి రేట్ పేయర్స్ నుండి మాత్రమే బలవంతంగా పన్నులు వసూలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం క్యాబినెట్ మంత్రుల సమావేశంలో సమీక్ష చేసి స్థానిక సంస్థల ప్రగతి రేట్ పేయర్స్ ఆర్థిక భారాలు గుర్తించాలని సూచించారు. సమావేశాన్ని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్ల పూడి రమణరాజు నిర్వహించారు. చింతపల్లి అజయ్ కుమార్, పెద్దిం శెట్టి రామకృష్ణారెడ్డి, జుత్తుక శ్రీనివాస రావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్