ప్రజాశక్తి - నార్పల : మండల పరిధిలోని కేసేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం జిల్లా విద్యా అధికారి అయూబ్ హుస్సేన్ స్థానిక మండల విద్యాధికారులు కృష్ణయ్య, నారపరెడ్డిలతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో పలు రిజిస్టర్లు రికార్డులను పరిశీలించారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం అన్ని అందుతున్నాయా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందజేయాలని ఏజెన్సీ నిర్వాహకులకు తెలిపారు. పాఠశాలలో ఫలితాలు బాగా ఉన్నప్పటికీ గత మూడేళ్లుగా విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య తగ్గుతుందని, ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయుడు సహకరించడం లేదని పలువురు ఉపాధ్యాయులు విద్యాధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో ప్రధానోపాధ్యాయునిపై జిల్లా విద్యాధికారి అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ముక్కుసూటిగా వ్యవహరించే కేసేపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జయరాంరెడ్డిపై జిల్లా విద్యాధికారి ఆగ్రహం వ్యక్తం చేయడం కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్న చందంగా ఉందని పలువురు గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రధాన ఉపాధ్యాయుడు ముక్కుసూటి తనం కొన్ని కఠిన నిర్ణయాల వల్లనే పాఠశాలలో మంచి ఫలితాలు వస్తున్నాయని కొందరి అడుగులకు మడుగులు వత్తే విధంగా ప్రధానోపాధ్యాయుడు వ్యవహరించలేదు అన్నది వాస్తవమని దీనిపైన అధికారులు కూడా పూర్తిస్థాయిలో లోతైన విచారణ జరపాలని పలువురు కోరుతున్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గడం, ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల మధ్య ఏర్పడిన సమన్వయ లోపం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలు పరిష్కరించి పూర్తిస్థాయి నివేదికను తనకు అందజేయాలని మండల విద్యాధికారులను జిల్లా విద్యాధికారి ఆదేశించారు. ఆధారాలతో ఫిర్యాదు చేసిన పాఠశాలలపై చర్యలు ఎక్కడ....... నార్పల మండలంలో పలు ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో ఆసౌకర్యాలు ఉపాధ్యాయుల అర్హతలు, ప్రైవేటు ఉపాధ్యాయులకు ఇచ్చే వేతనాలు వారి విద్యా అర్హతలు ఉన్నతాధికారుల ఆదేశాల బేఖాతారు స్థానిక విద్యాధికారుల పట్ల లెక్కలేనితనం, ఏదైనా సమస్యపైగానీ ఫిర్యాదు పై చర్చించడానికి తమ ఇంటి వద్దకే విద్యాధికారులు రావాలనడం తదితర అంశాలను జిల్లా విద్యాధికారి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ మండలానికి వచ్చిన జిల్లా విద్యాధికారి వాటి పట్ల అసలు స్పందించకపోవడం గమనార్హం. దీనిని బట్టి చూస్తే విద్యాధికారులపై ఎటువంటి ఒత్తిడి ఉందో అర్థమవుతోంది...
కేశేపల్లి ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 03:51 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)