ప్రజాశక్తి -చంద్రగిరి : చంద్రగిరిలో పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ వసతి గృహాలు పర్యవేక్షణ లోపానికి నిలయాలుగా మారుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి కష్టపడి చదివిద్దామని పంపిస్తే, హాస్టళ్ల చుట్టూ నెలకొన్న పరిస్థితులు విద్యార్థుల తల్లిదండ్రులను కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల భద్రతను కాపాడటానికి, వారి భవిష్యత్తును గాడిలో పెట్టడానికి హాస్టల్ ఆవరణలోనే 'రూపాయి కాయిన్ బాక్స్' ఏర్పాటు చేయాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. హాస్టళ్లలో ఫోన్ సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు సమీపంలోని ప్రైవేట్ దుకాణాల వద్ద ఉన్న కాయిన్ బాక్సులను ఆశ్రయిస్తున్నారు. కొందరు దుకాణదారులు కేవలం వ్యాపార లాభమే ధ్యేయంగా వాటిని దుకాణాల లోపల ఏర్పాటు చేసి, విద్యార్థులు గంటల తరబడి మాట్లాడేలా ప్రోత్సహిస్తున్నారు. కాయిన్ బాక్స్ బీజీగా ఉన్న సమయాల్లో దుకాణదారులే తమ సొంత సెల్ ఫోన్లను విద్యార్థులకు ఇచ్చి, వారి టాక్ టైంతో సంబంధం లేకుండా పేద విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. హాస్టల్ నుంచి పాఠశాలకు, పాఠశాల నుంచి హాస్టల్ కి వెళ్లే మార్గంలో పోకిరీలు ద్విచక్ర వాహనాలతో హల్ చల్ చేస్తూ విద్యార్థులను వేధిస్తున్నారు. ఈ వేధింపులు భరించలేక కొందరు బాలికలు మధ్యలోనే చదువు మానివేస్తున్న దుస్థితి నెలకొంది. మైనర్ బాలికలను ట్రాప్ చేసి తీసుకువెళ్తున్న సంఘటనలు తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. సమస్య జరిగాక స్పందించడం కంటే, ముందుగానే నివారణ చర్యలు తీసుకోవడం అధికారుల బాధ్యత అని, ఈ దిశగా కింది చర్యలు వెంటనే చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పై అధికారుల అనుమతితో సంక్షేమ వసతి గృహాల ఆవరణలోనే ఒక అధికారిక కాయిన్ బాక్స్ ఏర్పాటు చేయాలని, దీనివల్ల విద్యార్థులు ఎవరికి ఫోన్ చేస్తున్నారనే సమాచారం సిబ్బంది పర్యవేక్షణలో ఉంటుందని పేర్కొన్నారు. హాస్టళ్ల సమీపంలో అనధికారికంగా నడుస్తున్న కాయిన్ బాక్సులను తొలగించాలని, పాఠశాల వేళల్లో హాస్టల్ మార్గాల్లో పోలీసుల గస్తీ పెంచాలని కోరారు. బాలికల సంక్షేమ వసతి గృహాల చుట్టూ ప్రభుత్వం వెంటనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచాలని కోరారు. ఉపాధ్యాయులు నెలకు కనీసం ఒక్కసారైనా విద్యార్థులకు సమాజంలో నడుచుకోవాల్సిన తీరుపై, లక్ష్యసాధనపై ప్రత్యేక కౌన్సిలింగ్ ఇప్పించాలని కోరారు. పేదరికంతో సతమతమవుతూ ఉన్నత చదువులు చదవాలని ఆశపడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న ఆసాంఘిక శక్తుల ఆట కట్టించడానికి విద్యా, పోలీసు శాఖలు తక్షణమే సంయుక్త చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
సంక్షేమ వసతి గృహాల్లో 'రూపాయి కాయిన్ బాక్స్' ఏర్పాటుకు విజ్ఞప్తి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 04:04 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)