మంగళవారం, 03 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘మురసు’తో అస్తవ్యస్తం..

2 గంటల క్రితం

ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కూలిన విద్యుత్తు, కమ్యూనికేషన్‌ ‌వ్యవస్థ
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 01:16 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కూలిన విద్యుత్తు, కమ్యూనికేషన్‌ ‌వ్యవస్థ

  • పలు జిల్లాలో భారీ వర్షాలు

  • స్తంభించిన జన జీవనం

  • ఇద్దరు మృతి

ప్రజాశక్తి- యంత్రాంగం : మురసు తుపాను పలు జిల్లాలను అస్తవ్యస్తం చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించింది. ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో విద్యుత్తు, కమ్యూనికేషన్‌ ‌వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలాయి. తుపాను ముఖ్యంగా ఒంగోలుపై తీవ్ర ప్రభావం చూపింది. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. బలమైన ఈదురుగాలులకు చిన్నగంజాం టోల్ ప్లాజా వద్ద ఐరన్ కంటైనర్ కూలిపడింది. ఈ ఘటనలో టోల్ ప్లాజా వద్ద వాహనాల రాకపోకలను పర్యవేక్షించే విధుల్లో ఉన్న పెదగంజాం గ్రామానికి చెందిన చొప్పరపు జాన్ అగస్టిన్ (25) మృతి చెందారు. బాపట్ల జిల్లా కారంచేడు మండలం దగ్గుబాడు గ్రామంలో పక్క ఇంటిపై వాటర్‌ ‌ట్యాంకు రేకుల ఇంటిపై పడటంతో ఆ ఇంట్లో నిద్రిస్తున్న మాటలపూడి తిరుపతమ్మ (66) అక్కడికక్కడే మరణించారు. పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్తు సరఫరా, ఇంటర్‌‌నెట్‌ ‌సేవలు నిల్చిపోయాయి. సెల్‌ ‌ఫోన్లు మూగబోవడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వర్షం, భీకర గాలులతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకూ ఇదే పరిస్థితి నెలకొంది. తుపాను తీరం దాటే సమయంలో 120 కిలోమీటర్లకుపైగా వేగంతో గాలులు వీచాయి. తెల్లారుజామున ఒంగోలు-చినగంజాం మధ్య తీరం దాటింది. తీర ప్రాంత మండలాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. ఒంగోలు పట్టణంలో పరిస్థితి భయానకంగా మారింది. ఒక్కరోజులోనే 174.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కలెక్టరేట్‌లోని ఏళ్ల నాటి పెద్ద పెద్ద చెట్లు పడిపోయాయి. ఒంగోలు పట్టణంలో రాత్రి వరకు చాలా ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిల్చిపోయింది. రైల్వే ట్రాకులపై అక్కడక్కడా నీరు చేరడంతో ఒంగోలు స్టేషన్లో పలురైళ్లను కాసేపు ఆపేశారు. తీరం దాటిన చినగంజాం ప్రాంతంలోనూ, కొత్తపట్నం, సంతనూతలపాడు, మద్దిపాడు, శింగరాయకొండ, నాగులుప్పలపాడు మండల్లాల్లోనూ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది.

​ గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో అత్యధికంగా 200 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో రహదారులు జలదిగ్బంధనలో చిక్కుకున్నాయి. గుంటూరు-చిలకలూరిపేట జాతీయ రహదారిపై రెండు అడుగుల ఎత్తున వర్షం నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రాజధాని అమరావతి ప్రాంతాన్ని వర్షపు నీరు ముంచెత్తడంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. పల్నాడు జిల్లాలో వందలాది గ్రామాల్లో అంధకారం అలుముకుంది. గుంటూరును వరద నీరు ముంచెత్తింది.

ప్రకాశం బ్యారేజీకి పెరిగిన వరద ప్రవాహం

ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరిగింది. ఎగువ నుంచి పది వేల క్యూసెక్కుల వరకు నీరు వస్తుందన్న అంచనా నేపథ్యంలో కృష్ణా నది దిగువకు సుమారు 5,000 నుండి 10,000 క్యూసెక్కుల అదనపు నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా పలుప్రాంతాల్లో రాత్రి నుండి వర్షం ఏకధాటిగా కురవడంతో రోడ్లు జలమయమయ్యాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. విజయవాడ నగరంలో గరిష్టంగా 48.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విశాఖ నగరంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది.

అర్నబ్ తుపాను నుంచి కోలుకోకముందే మురసు పంజా

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు అల్లాడిపోయాయి. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి వరి పంట దాదాపు తుడిచిపెట్టుకు పెట్టుకుపోయింది. ఈ జిల్లాలో 1.23 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేశారు. అర్నబ్ తుపాను ప్రభావానికి దాదాపు 80 వేల ఎకరాలకు నష్టం వాటిల్లింది. కాస్తోకూస్తో పంట చేతికి వస్తుందనుకుంటున్న సమయంలో మురసు తుపాను పంటను పూర్తిగా తుడిచిపెట్టేసింది. కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో రెండు లక్షల ఎకరాలకుపైగా వరి పంట, 50 వేల ఎకరాలకుపైగా ఉద్యాన పంటలు, 20 వేల ఎకరాల్లో కూరగాయల పంటలు పూర్తిగా పాడయ్యాయి. ఏలూరు జిల్లాలో 62.4 మిల్లీమీటర్ల సగటు వర్షంపాతం నమోదైంది. 13,754 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరి పంట 13,272 ఎకరాల్లో నష్టపోగా, ఉద్యాన పంటలు 482 ఎకరాల్లో ఉన్నాయి. గతంలో వచ్చిన అర్నబ్‌ ‌తుపానుకు 42 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. పశ్చిమగోదావరి జిల్లాలో69.9 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. మురసు తుపానుకు మరో 50 వేల ఎకరాల్లో పంట నష్టం ఉండనున్నట్లు అధికారులు తెలిపారు.

అంధకారంలోనే గ్రామాలు

డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇంకా అంధకారంలోనే ఉంది. అర్నబ్ తుపాను అనంతరం అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రపురం, కొత్తపేట వంటి మండలాల్లో మండల కేంద్రాలు, కొన్ని గ్రామాలకు మాత్రమే విద్యుత్ పునరుద్ధరణ జరిగింది. ప్రస్తుతం మురసు తుపానుతో జిల్లాలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. విద్యుత్తు పునరుద్ధరణ పనులకు భారీ వర్షాలు అడ్డంకిగా మారాయి. పోలవరం జిల్లా మారేడుమిల్లి, విఆర్‌.పురం, కూనవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల్లో జోరు వాన కురిసింది.

పలు విమాన సర్వీసులు రద్దు

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, సింగపూర్, కడప వెళ్లాల్సిన పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. విజయవాడ మీదుగా నడిచే పలు సుదూర ప్రాంతాల రైళ్లను రైల్వే శాఖ రీషెడ్యూల్ చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది. ఆర్‌‌టిసి బస్సు సర్వీసులు అరకొరగా నడుస్తున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్