మంగళవారం, 03 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనేరాల వైపు యువత ...

1 గంట క్రితం

Picture32-1793719845968-9366.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 03:31 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ఆటపాటలతో, చదువు సంధ్యలతో, స్నేహానురాగాలతో వికసించాల్సిన బాల్యం నేడు మొగ్గ ప్రాయంలోనే వాడిపోతోంది. 'నేటి బాలలే రేపటి పౌరులు' అని పైకి ఎన్ని మాటలు చెబుతున్నప్పటికీ వాస్తవాలు అందుకు భిన్నంగా వున్నాయి. నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతతో ఉత్తమ పౌరులుగా ఎదగాల్సిన వారు నేడు నేరస్తులుగా మారుతున్నారు. ఇది ఎంతో బాధను, భయాందోళనలను కలిగించే విషయం. రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి బాలికపై జరిగిన రంపపు దాడి ఘటన దీనికి నిదర్శనం. మహిళలపై చోటుచేసుకుంటున్న వరుస అత్యాచార సంఘటనలు మన నాగరికతను, సభ్యతను, నైతికతను, ఈ వ్యవస్థ ఉనికినే ప్రశ్నిస్తున్నాయి. సభ్యసమాజం సిగ్గుపడేలా జరుగుతున్న దాడులు దేనికి నిదర్శనం..?

అశ్లీలత, హింసను ప్రేరేపించే...​

పిల్లలను, యువతీయువకులను సినిమాలు, టివి కార్యక్రమాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. హీరోయిజం పేరుతో తాగుడు, ముఠా తగాదాలు, హింస, బాధ్యతారా హిత్యం, ఏం చేసైనా సరే డబ్బు సంపాదించాలానే ధోరణి, అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం, అధ్యాపకులు, తల్లిదండ్రులు, పెద్దలతో బాధ్యతారహితంగా ప్రవర్తించడం మొదలైన అంశాలను చిత్రీకరిస్తున్నారు. టీవీ సీరియళ్లు, రియాలిటి షోలలో సభ్యత, సంస్కారం లేని విధంగా సంభాషణలు, హావభావాలు ఉంటున్నాయి. మొబైల్ ఫోన్లలో లైక్ లకోసం అసహ్యకరమైన పనులు చేస్తున్నారు. ఇంట, బయట నిత్యం వీటిని చూస్తూ పెరుగుతున్న పిల్లల్లో ఎలాంటి ఆలోచనలు వస్తాయి? దాంతో నేడు చిన్నపిల్లలు సైతం జ్ఞాన సముపార్జన కంటే ప్రేమ, సెక్స్ వంటి విషయాల గురించి మాట్లాడుతున్నారు. పాఠశాల స్థాయి నుంచే చెడు స్నేహాలు చేయడం ముఠా తగాదాలకు పాల్పడడం జరుగుతోంది. ​

మరీ ముఖ్యంగా, కోవిడ్ తర్వాత కూడా ఆన్‌‌లైన్ తరగతుల సమయంలో పిల్లల మొబైల్ వాడకం పెరిగింది. మొబైళ్లను వాడే సమయంలో తెలిసీ, తెలియక సాఫ్ట్ పోర్నోగ్రఫీ కుళ్ళు అంటించుకొంటున్నారు. క్రమంగా బానిసలై, పక్కదారి పట్టి అత్యాచారాలకు, దాడులకు పాల్పడుతున్నారు. సున్నిత మానవ భావోద్వేగాలను, నైతిక సంబంధాలను నాశనం చేసే పోర్నోగ్రఫీ వేల కోట్ల డాలర్ల పరిశ్రమగా తయారై వయస్సుతో నిమిత్తం లేకుండా అందరిననీ కలుషితం చేస్తోంది. ​

పురుషాధిక్యత ప్రభావం ​

వేల సంవత్సరాలుగా వివిధ రూపాలలో కొనసాగుతున్న పురుషాధిపత్య సంస్కృతి ప్రభావం నేటి పెట్టుబడిదారీ వ్యవస్థలో మరింత అసహ్యకర వికృత రూపం ధరించింది. పురుషుడి అనుభవం కోసమే స్త్రీ, అన్ని విధాలా ఆమె పురుషు డికి లోబడి ఉండాలనే సంస్కృతి ప్రభావంతో వేధింపులు, దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. ప్రేమ, సమానత్వం, సహకారం, స్నేహం, పరస్పర విశ్వాసం పెంచే ఉన్నత సంబంధాలు స్త్రీ పురుషులలో పెంపొందనంత వరకు ఇవి పెరుగుతాయి.

మద్యం, మాదకద్రవ్యాలు...

హేయమైన నేరాలకు పాల్పడుతున్న యువతలోనే కాక బాలల్లో కూడా మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన వారుండడం మరింత కలవరపెట్టే అంశం. ఆ మత్తులో విచక్షణ కోల్పోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. పాఠశాలల్లో గంజాయి తాగుతూ బాలలు పట్టుబడ్డ ఉదంతాలున్నాయి. మాదకద్రవ్యాలను అరికట్టడం అటుంచి కొంతమంది పాలక పార్టీల నేతలు వీటి రవాణాలో ముఖ్య పాత్ర నిర్వహిస్తున్నారు. ఆధునికత పేరుతో పబ్బులు, క్లబ్బులు, రేవ్ పార్టీలలో నిషేధిత మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా వాడుతున్నారు. ఇవన్నీ ప్రభుత్వాలకు, పోలీసులకు ప్రత్యేక్షంగానూ, పరోక్షంగానూ తెలిసే జరుగుతున్నాయి. అప్పుడప్పుడు దాడుల పేరుతో ప్రభుత్వాలు తతంగం నడిపినప్పటికీ వీటి రవాణా యథావిధిగా కొనసాగుతూనే ఉంది. వీటి విష ఫలితాలను ప్రజలు ముఖ్యంగా యువత చవిచూడాల్సి వస్తున్నది.

కొరవడిన శాస్త్రీయ విద్యా విధానం ‌

​ విద్యార్థుల్ని సంపూర్ణ మూర్తిమత్వంతో జ్ఞానవంతులుగా తయారు చేయడమే విద్య లక్ష్యం. కానీ ఈనాడు విద్యా విధానం ద్వారా అది నెరవేరుతోందా? ప్రభుత్వ విధానాల వల్ల విద్య నేడు పూర్తిగా ప్రైవేటుపరమై పచ్చి వ్యాపారంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యావిధానంలో చేపట్టిన మార్పులతో శాస్త్రీయ, లౌకిక, ప్రజాతంత్ర విధానాలకు సంబంధించిన అంశాలు చిన్నారులకు అందకుండా పోతున్నాయి. నైతిక విలువలు, క్రమశిక్షణ, మానసిక దృఢత్వం వీరికి అందుతున్నాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సమాజ హితం కోసం పోరాడినటువంటి ఉన్నత వ్యక్తుల జీవిత చరిత్రలు విద్యార్థులకు అందకపోవడం వల్ల సరైన ఆదర్శం లేక విలువలు లేని మరమనుషులుగా తయారవుతున్నారు. నేడు విద్యా విధానంలో ర్యాంకులు, గ్రేడ్లు ధ్యేయంగా మారడంతో కెరీరిజం, పచ్చి స్వార్థం, తీవ్ర స్థాయిలో పెరిగిపోతోంది. మంచి చెడుల విచక్షణను విద్యార్థులు గ్రహించలేక మానసికంగా బలహీనులై పోతున్నారు. త్వరగా చెడు వైపుకు ఆకర్షితులవుతున్నారు.

నిరుద్యోగం, అసమానతలు

రోజు రోజుకూ నిరుద్యోగ సమస్య, ఉపాధి లేమి, అసమానతలు భయంకర రూపం ధరించసాగాయి. ధనవంతులు మరింత ధనవంతులుగాను పేదలు మరింత పేదలుగాను మారుతున్నారు. యువతలో తీవ్ర నిరాశ నిస్పృహలు పెరిగాయి. ఫలితంగా ఒకవైపు మానసిక రోగాలు, ఇంకోవైపు అక్రమ సంపాదన, ఆన్ లైన్ మోసాలు, నేరాలు, ఆత్మహత్యలు పెరిగాయి. కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ పనిచేస్తేనే ఇల్లు గడవడం కష్టం. అలాంటప్పుడు పిల్లలు ఆలనా పాలనా లేక చెడుదారి పడుతున్నారు. నేర ప్రవృత్తి పెరుగుతోంది. ప్రభుత్వాలు ఈ సమస్యలను పరిష్కరించగలిగితేనే సమాజంలో నేర ప్రవృత్తి తగ్గుముఖం పడుతుంది.


సాయి ఉదయ్,

కర్ణాటక కేంద్రీయ విశ్వవిద్యాలయం,

సెల్‌: 9100882889.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్