ఆకట్టుకున్న ఇస్రో స్పేస్ ఆన్ వీల్స్
ఇంటిని మరో పాఠశాలగా మార్చొద్దు : డాక్టర్ గేయానంద్
2027 గగనయాన్కు ముగ్గురు వ్యోమగాములను పంపుతాం : రిసోర్స్ పర్సన్ మూర్తినాయక్
ప్రజాశక్తి - భీమవరం : భీమవరంలోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు రెండో రోజు సోమవారం అత్యంత ఉల్లాసంగా.. ఉత్సాహంగా సాగాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు ఎంతో ఆసక్తిగా సంబరాల్లో మునిగి తేలారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి సంబరాలకు వచ్చిన విద్యార్థులను నిర్వాహకులు ఉండి కృషి విజ్ఞాన కేంద్రం సందర్శనకు తీసుకెళ్లారు. కృషి విజ్ఞాన కేంద్రం ఇన్ఛార్జి డాక్టర్ ఎ.శ్రీనివాసరావు, వ్యవసాయ శాస్త్రవేత్త వినయలక్ష్మి విజ్ఞాన కేంద్రం ప్రాముఖ్యత, వ్యవసాయం, ఉద్యాన పంటలు, మృత్తికల స్వభావం, పంటల దిగుబడికి జలవనరుల సేకరణలో మెళకువలు, పంటలకు వచ్చే చీడల నివారణ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పంటల దిగుబడులపై విద్యార్థులు అధ్యయనం చేశారు. స్పేస్ పోర్ట్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతున్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట నుండి వచ్చిన ఇస్రో వారి స్పేస్ ఆన్ వీల్స్ విద్యార్థులను ఆకట్టుకుంది. ఇస్రో శ్రీహరి కోట నుండి వచ్చిన రిసోర్స్ పర్సన్ కె.మూర్తినాయక్ విద్యార్థులకు అంతరిక్షం పట్ల అవగాహన కల్పించారు. గగన్ యాన్ ద్వారా మొదటిసారిగా భారతదేశం నుండి ముగ్గురు వ్యోమగాములను డిసెంబర్ 2027లోపు పంపించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. వివిధ రకాల ప్రయోగాలు, క్విజ్ పోటీలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. జెవివి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సురేష్, ప్రొఫెసర్ ఎ.రామచంద్రయ్య, ప్రొఫెసర్ కె.లక్ష్మారెడ్డి చెకుముకి రాష్ట్ర కన్వీనర్ కెఎంఎంఆర్.ప్రసాద్, జెవివి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జామాను రామలక్ష్మణరావు, మల్లుల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు చింతపల్లి ప్రసాదరావు, చెకుముకి జిల్లా కన్వీనర్ రేపాక వెంకన్న బాబు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చదువులో ఒత్తిడికి గురవుతున్నారని, ఇంటిని మరో పాఠశాలగా మార్చొద్దని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎం.గేయానంద్ చెప్పారు. చెకుముకి సంబరాల్లో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో వివిధ అంశాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. విద్యా వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయన్నారు. ప్రపంచంలో ఉన్న సమాచారం అంతా విద్యార్థుల చేతుల్లోనే ఉందని, వారికి ఎవరూ నేర్పించాల్సిన అవసరం లేదని వివరించారు. టి.సురేష్ మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో సైన్సుకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. జెవివి రాష్ట్ర కోశాధికారి మురళీధరన్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)