దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను గాడిన పెట్టాం
తుపాన్లు.. కరువుపై ఒకేసారి కేంద్ర బృందాల పర్యటన
మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వరుసగా విరుచుకుపడిన అర్నబ్, మురసు తుపాన్లలో ప్రాణ నష్టాన్ని నివారిస్తూ, ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంతగా తగ్గించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టిజిఎస్ కేంద్రంలో ముఖ్యమంత్రి మీడియా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుపాన్ల సమయంలో ప్రభుత్వంలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది రాత్రిపగలు పనిచేశారని ప్రశంసించారు. ముఖ్యంగా ప్రభావిత జిల్లాల కలెక్టర్లు టీమ్ లీడర్లుగా వ్యవహరించి సహాయక చర్యలను సమర్థంగా సమన్వయం చేశారని కొనియాడారు. ముఖ్యమంత్రి మొదలుకుని స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ కార్యాలయాల సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ టీమ్ స్పిరిట్‌తో పనిచేశారని పేర్కొన్నారు. అధికార యంత్రాంగం, ప్రజల సహకారంతోనే సహాయక చర్యలను సమర్థంగా నిర్వహించగలిగామని చెప్పారు. విపత్తు నిర్వహణలో రక్షణ, సహాయక చర్యలు, పునరావాసం అనే మూడు అంశాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చామని చెప్పారు. తుపాన్ల గమనాన్ని, గాలుల వేగాన్ని, వర్షపాత అంచనాలను నిరంతరం విశ్లేషిస్తూ ముందస్తు ప్రణాళికతో వ్యవహరించామని వెల్లడించారు. ఆర్టిజిఎస్ ద్వారా క్షేత్రస్థాయి యంత్రాంగానికి ఎప్పటికప్పుడు కచ్చితమైన సమాచారాన్ని చేరవేశామని, అవేర్ వ్యవస్థ ద్వారా అందిన డేటాను విశ్లేషించి నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. గాలుల వేగం, వర్షపాతం, వరద నిర్వహణ, నీటి మళ్లింపు తదితర అంశాలపై చేసిన అంచనాలు క్షేత్రస్థాయి వాస్తవాలతో పోల్చినప్పుడు 90 శాతం వరకు సరైనవిగా తేలాయని పేర్కొన్నారు.
4, 5 రోజుల్లోనే పూర్తి
తుపాన్ల కారణంగా వివిధ జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టి కేవలం 4, 5 రోజుల్లోనే సరఫరాను చాలా వరకు పునరుద్ధరించామని సిఎం చంద్రబాబు వెల్లడించారు. సుమారు 31 వేల విద్యుత్ స్తంభాలు కూలిపోగా, 4,095 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని, 548 సబ్స్టేషన్ల పరిధిలో సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులతో, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో మాట్లాడి అదనపు సిబ్బందిని పంపాలని కోరినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పరిస్థితిని కేంద్రానికి ఎప్పటికప్పుడు వివరించామని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో.. సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. విద్యుత్ సిబ్బంది ప్రాణాలకు తెగించి పనిచేసి సరఫరాను త్వరగా పునరుద్ధరించారని అభినందించారు. తుపాన్ల ప్రభావిత ప్రాంతాలకు చెందిన సుమారు 5 వేల మంది గర్భిణులను ముందుగానే గుర్తించి ఆస్పత్రులకు తరలించామని వెల్లడించారు. ఈ వారం రోజుల్లోనే 1,029 మంది గర్భిణులకు ప్రసవాలు జరిగాయని వివరించారు. రెండు తుపాన్ల ద్వారా వచ్చిన నీటిలో 11 టిఎంసిలను రిజర్వాయర్లకు మళ్లించగలిగామని, మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో మరో 25 టిఎంసిల నీటిని నిల్వ చేయగలిగామని వెల్లడించారు. తుపాన్లపై ఓ మాన్యువల్‌ను రూపొందించి అమలు చేస్తామని తెలిపారు. అర్నబ్ తుపాను నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం పర్యటిస్తుండగా, ఎల్‌నినో పరిస్థితులను అంచనా వేసేందుకు మరో బృందం క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరుపుతోందన్నారు. ఒక రాష్ట్రం ఒకేసారి ఇన్ని విపత్తులను ఎదుర్కోవడం ఇదే తొలిసారని, తాను కూడా ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు.







కామెంట్లు (0)