కేంద్ర కరువు బృందం ఎదుట రైతుల ఆవేదన
ప్రజాశక్తి -బత్తలపల్లి, ముదిగుబ్బ (అనంతపురం జిల్లా), నంద్యాల జిల్లా : ‘ఆరు దశాబ్దాల కాలంలో ఇలాంటి కరువును ఎన్నడూ చూడలేదు.. పంటల పెట్టుబడి రాక అప్పులపాలయ్యాం.. ప్రభుత్వాలే తమను ఆదుకోవాలి.. లేకుంటే భవిష్యత్తులతో వ్యవసాయం చేయలేం’.. అంటూ కేంద్ర కరువు బృందం ఎదుట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి, ముదిగుబ్బ మండలాల్లో, నంద్యాల జిల్లా నందికొట్కూరు, జూపాడుబంగ్లా మండలాల్లో కేంద్ర కరువు బృందాలు మంగళవారం పర్యటించాయి. శ్రీసత్యసాయి జిల్లాలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ చిన్మయ్ గోట్మారే ఆధ్వర్యంలో పది మంది అధికారుల బృందం.. బత్తలపల్లి మండల పరిధిలోని బత్తలపల్లి, గుమ్మల్లకుంట, దంపెట్ల, రామాంజులపల్లి గ్రామాల రైతుల వివరాలు సేకరించింది. వర్షపాతం లోటు కారణంగా వేరుశనగ, కంది, ఆముదం, మొక్కజొన్న ఉలవ వంటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కేంద్ర బృందానికి జిల్లా వ్యవసాయ అధికారి కృష్ణయ్య వివరించారు.
చెరువులకు నీరిచ్చి ఆదుకోండి...
ధర్మవరం చెరువు నుంచి ఇతర జలాశయాల నుంచి బత్తలపల్లి మండలంలోని చెరువులకు, చిత్రావతి నదికి నీరు విడుదల చేసి రైతాంగాన్ని, మూగజీవాలను ఆదుకోవాలని పలువురు కోరారు. దంపెట్ల సమీపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు రైతులు, గొర్రెల కాపర్లు, ఉపాధి కార్మికులు నరసింహులు, వెంకటనాయుడు, చంద్రశేఖర్‌నాయుడు, వెంకటరమణ, దరూరి రామకృష్ణ, నాగప్ప, నారాయణస్వామి, రాఘవంపల్లి రామకృష్ణ మాట్లాడారు. లోటు వర్షపాతం కారణంగా చెరువులు, కుంటలలో నీరు లేక రైతులు, మూగజీవాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వారికి వివరించారు. చివరకు తాగేందుకు కూడా నీరు లభించే పరిస్థితి కనిపించలేదని వాపోయారు. హంద్రీ నీవా, చిత్రావతి రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేయాలని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ శ్రీసత్యసాయి జిల్లాలో 1180 చెరువులుంటే అందులో 160 చెరువులలో మాత్రమే నీరుందన్నారు. సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. వంద రోజులు పూర్తి చేసుకున్న ఉపాధి కార్మికులకు అదనంగా 50 రోజులు పని దినాలు కల్పించాలని పలువురు కోరారు. చెరువులకు నీరు ఇస్తే వలస వెళ్లకుండా కార్మికులకు పనులు చింది.దక్కుతాయన్నారు. అనంతరం వివిధ సమస్యలపై అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. చివరగా కేంద్ర బృందం సభ్యులు మాట్లాడుతూ పండ్ల తోటలు, వ్యవసాయ పంటలు, పశుగ్రాసం కొరత సంబంధించిన విషయాలు క్షేత్రస్థాయిలో పరిశీలించామన్నారు. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసి రైతులను ఆదుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ మంజీర్ జిలాని సమూన్, మహాలనోబిస్ నేషనల్ క్రాప్ ఫోర్కాస్ట్ సెంటర్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభా కాంతి, గ్రామీణాభివృద్ధి శాఖ అండర్ సెక్రటరీ వినోద్సామంత్, కేంద్ర ఆర్థిక వ్యయశాఖ డిప్యూటి డైరెక్టర్ పంకజ్ పహాడియా, అధికారులు, జిల్లా, డివిజన్, మండల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు.

నంద్యాల జిల్లాలో క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాల ఆధారంగా కరువు పరిస్థితులు, పంట నష్టాలపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని కేంద్ర కరువు అంచనా బృందం తెలిపింది. భారత ప్రభుత్వ డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ డెవలప్మెంట్ డైరెక్టర్ డాక్టర్ కె పొన్నుసామి ఆధ్వర్యంలోని కేంద్ర బృందం ఖరీఫ్–2026 సీజన్లో నెలకొన్న కరువు పరిస్థితులు, పంట నష్టాలను అంచనా వేసేందుకు నందికొట్కూరు, జూపాడుబంగ్లా, పాములపాడు మండలాల్లో పలు గ్రామాల్లోని పంట పొలాలను పరిశీలించింది. నందికొట్కూరు, జూపాడుబంగ్లా మండలంలోని మండ్లెం, తర్తూరు, పాములపాడు మండలంలోని కృష్ణారావుపేట, రుద్రవరం, ఎర్రగూడూరు గ్రామాల్లో పర్యటించింది. కరువు ప్రభావంతో దెబ్బతిన్న మొక్కజొన్న, కంది, పత్తి, ఉల్లి, సోయాబీన్ పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. రైతులతో మాట్లాడి సాగు వివరాలు, వర్షాభావ పరిస్థితులు, దిగుబడులపై ప్రభావం, ఆర్థిక నష్టాలను అడిగి తెలుసుకుంది. అనంతరం ఎర్రగూడూరు వద్ద ఎస్‌ఆర్‌ఎంసి కాలువను సందర్శించి ఆయకట్టుకు సాగునీటి సరఫరా, నీటి లభ్యత, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంది. ఆత్మకూరు అటవీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను జిల్లా కలెక్టర్ జి రాజకుమారితో కలిసి కేంద్ర బృందం పరిశీలించింది. వ్యవసాయం, ఉద్యానవనం, తాగునీటి ఎద్దడి, ఎండిపోయిన బోరుబావులు, నీటి వనరులు, పశుపోషణ, విబి గ్రామ్ జి తదితర అంశాలకు సంబంధించిన ఫొటోలు, పత్రికా కథనాలను పరిశీలించింది. కరువు తీవ్రత, పంట నష్టాలు, రైతులకు అందిస్తున్న సహాయక చర్యలను కేంద్ర బృందానికి అధికారులు వివరించారు. క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాల ఆధారంగా జిల్లాలో కరువు పరిస్థితులు, పంట నష్టాలపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని కేంద్ర బృందం తెలిపింది.







కామెంట్లు (0)