చెకుముకి సంబరాల ముగింపు సభలో మాజీ ఎమ్మెల్సీ విఠపు సుబ్రమణ్యం
ప్రజాశక్తి - భీమవరం : విద్యార్థుల చేతుల్లోనే భావితరాల భవిష్యత్తు ఉందని జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సీతారామరాజు స్మారక కేంద్రంలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరుగుతున్న రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు మంగళవారంతో ముగిశాయి ఈ సందర్భంగా సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాణ రాష్టాల నుండి విద్యార్థులు వచ్చి సంబరాలలో పాలుపంచుకోవడం అభినందనీయమన్నారు. ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని పేర్కొన్నారు. ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. విద్యార్థులు సైన్స్ పట్ల మరింత మక్కువ పెంచుకొని శాస్త్రవేత్తలుగా ఎదిగి భవిష్యత్తు తరాలకు నూతన ఆవిష్కరణలు అందించాలని సూచించారు.
జిల్లా విద్యాశాఖ అధికారి ఒవిఎస్ అనిల్ కుమార్ మాట్లాడుతూ చెకుముకి రాష్ట్ర స్థాయి సంబరాలను భీమవరంలో నిర్వహించడం గర్వకారణమని అన్నారు. విజేతలకు అభినందనలు తెలిపారు. సిసిఎంబి మాజీ డిప్యూటీ డైరెక్టర్, చీఫ్ సైంటిస్ట్ వేగేశ్న రాధా మాట్లాడుతూ సైన్స్ సంబరాలలో నేర్చుకున్న విషయాలను తోటి వారికి చేరవేయాలన్నారు. భవిష్యత్తు అంతా విద్యార్థుల చేతుల్లో ఉందని పేర్కొన్నారు. మాజీ ప్రొఫెసర్ విజయలక్ష్మి మాట్లాడుతూ సమాజంలో ఏర్పడుతున్న అడ్డంకులను విద్యార్థులు మహిళలు ఎదుర్కోవాలన్నారు. మాజీ ప్రొఫెసర్ ఎ రామచంద్రయ్య మాట్లాడుతూ బావితరాల శాస్త్రవేత్తలను తయారు చేయడమే జెవివి ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు. మాజీ ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి, ఇస్రో రిసోర్స్ పర్సన్ మూర్తి నాయక్ మాట్లాడుతూ శ్రీహరి కోటలో స్పేస్ కోట ఆఫ్ ఇండియా ఉందని దీనిని విద్యార్థులు ఉపాధ్యాయులు వినియోగించుకోవాలని సూచించారు. జెవివి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సురేష్ మాట్లాడుతూ మూడు రోజులు చెకుముకి సంబరాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో జీవివి రాష్ట్ర కోశాధికారి మురళీన్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామానుజరావు , మల్లుల శ్రీనివాస్ , చెకుముకి జిల్లా కన్వీనర్ రాపాక వెంకన్న బాబు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి చెకుముకి విజేతలు వీరే
ప్రభుత్వ పాఠశాలల నుండి స్పేస్ సెంట్రల్ స్కూల్, సూళ్లూరుపేట, తిరుపతి జిల్లా ప్రధమ స్థానాన్ని, పి ఎం శ్రీ మోడల్ స్కూల్, అయ్యప్ప నగర్, విజయనగరం ద్వితీయ స్థానాన్ని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మారేడుమిల్లి, పోలవరం జిల్లా తృతీయ స్థానాన్ని, ప్రైవేట్ పాఠశాలల నుండి గుడ్ షెఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, నంద్యాల ప్రథమ స్థానాన్ని, అమరరాజా విద్యాలయ, కరకంబాడి, తిరుపతి జిల్లా ద్వితీయ స్థానాన్ని, రాధ స్కూల్ అఫ్ లెర్నింగ్, సమతారాం, అనంతపురం జిల్లా తృతీయ స్థానాన్ని సాధించారు. విజేతలకు ప్రశంసా పత్రాలు, మెమంటోల సైన్స్ కిట్లను అందజేశారు.








కామెంట్లు (0)