మంగళవారం, 03 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎబి పిటిషన్‌‌పై సుదీర్ఘ వాదనలు

1 గంట క్రితం

ap high court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026, 10:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి : షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ నుంచి విద్యుత్ పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సిబిఐ విచారణ కోరుతూ మాజీ ఐపిఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో మంగళవారం సుదీర్ఘ వాదనలు జరిగాయి. వాదనలు కొనసాగాల్సి ఉండటంతో విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఎపిఎస్‌‌పిడిసిఎల్‌ 2021 నుంచి జారీ చేసిన ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలు టెండర్లపై సిబిఐ విచారణ జరిపించాలని ఎబి పిల్ దాఖలు చేశారు. మంగళవారం ఆయన స్వయంగా వాదిస్తూ.. షిర్డీ సాయి సంస్థకు అనుకూలంగా, ఇతర సంస్థలు అర్హత సాధించకుండా టెండర్ నిబంధనలు రూపొందించారని ఆరోపించారు. సంస్థ సరఫరా చేసిన 25 కెవిఎ ట్రాన్స్‌ఫార్మర్లు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేవని, ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌ను రూ.1.40 లక్షలకు కొనుగోలు చేస్తుండగా తెలంగాణ ప్రభుత్వం మరో సంస్థ నుంచి అదే ప్రమాణాలతో రూ.85 వేలకే కొనుగోలు చేస్తోందన్నారు. ఒక్కోదానిపై రూ.55 వేల వ్యత్యాసం ఉందని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. ఫైవ్‌స్టార్ రేటింగ్ ప్రమాణాలు కూడా పాటించడం లేదని, ఎపిఇఆర్‌‌సిని ఆశ్రయించినా విచారణ జరగలేదని తెలిపారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదిస్తూ.. షిర్డీ సాయి సంస్థ 2022 నుంచి ట్రాన్స్‌ఫార్మర్లు సరఫరా చేస్తోందని, ఇన్నేళ్ల తర్వాత పిల్ దాఖలుకు కారణాలు చెప్పలేదన్నారు. టెండర్ నిబంధనలపై ఏ సంస్థా అభ్యంతరం వ్యక్తం చేయలేదని, ఆరోపణలకు పిటిషనర్ ప్రాథమిక ఆధారాలు సమర్పించలేదని పేర్కొన్నారు. సాంకేతిక ప్రమాణాల్లో వ్యత్యాసాలున్నందున ఇతర రాష్ట్రాల ధరలతో పోల్చడం సరికాదని, కేవలం అనుమానాలతో సిబిఐ విచారణ కోరలేరని వాదించారు. షిర్డీ సాయి సంస్థ తరపున సీనియర్ న్యాయవాది శ్రీ రఘురామ్ వాదిస్తూ.. ట్రాన్స్‌ఫార్మర్లలో వినియోగించే విడి భాగాలు, వాటి నాణ్యతను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుందని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్