మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపట్టణాలే గ్రోత్ ఇంజన్లు

48 నిమిషాల క్రితం

chandra babu.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 12:48 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • వీకెండ్ ఎకానమీ పెంచేలా చర్యలు

  • రాష్ట్రంలో రూ.11,359 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం

  • పట్టణ స్థానిక సంస్థలపై ఆర్థిక భారం పడకుండా అభివృద్ధి : ముఖ్యమంత్రి చంద్రబాబు

​ప్రజాశక్తి - కుప్పం : ‘పట్టణాలే గ్రోత్ ఇంజన్లనీ, వీకెండ్ ఎకానమీ పెంచేలా చర్యలు చేపట్టాలని, అర్బన్ ప్రాస్పెరిటీ విభాగంగా పట్టణాభివృద్ధి శాఖను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రూ.11,359 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను వర్చువల్ విధానంలో కుప్పం కేంద్రంగా మంగళవారం ఆయన ప్రారంభించారు. పట్టణ ప్రాంతాలు ఆర్థిక వ్యవస్థకు గ్రోత్‌ ఇంజన్లుగా మారేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణాల్లో నివాస యోగ్యత మెరుగుపడటంతో పాటు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా అభివృద్ధి చేయాలని దిశానిర్దేశం చేశారు. పట్టణాల్లో వీకెండ్ ఎకానమీ విపరీతంగా పెరుగుతోందని, తమకు వచ్చే ఆదాయంలో 61 శాతం డబ్బును వారాంతాల్లో ఖర్చు చేస్తున్నారని, రవాణా నిమిత్తం 71 శాతం ఖర్చు పెడుతున్నారని వెల్లడించారు. దీనిపై అధికారులు, ప్రజా ప్రతినిధులు మరింత అధ్యయనం చేయాలని, దీనికి అనుగుణంగా వారాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

టిడ్కో గృహాలు... ఇంటింటికి తాగు నీరు

2027 నాటికి రాష్ట్రంలోని టిడ్కో గృహాల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని సిఎం ప్రకటించారు. విశాఖ నగరంలో 28,500 కుటుంబాలకు ఇప్పటికే ఇళ్ల పట్టాలిచ్చామని, అభ్యంతరాలు లేని ప్రాంతాల్లో మరిన్ని పట్టాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పట్టణ ప్రజలకు 24 గంటలూ సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యంతో జల్‌ జీవన్‌ మిషన్‌ను పూర్తి చేయాలని ఆదేశించారు. 123 మున్సిపాలిటీల పరిధిలో రూ.7,469 కోట్లు, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.3,890 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రూ.4,656 కోట్లతో రహదారులు, రూ.88 కోట్లతో సెంట్రల్ మీడియన్లు, రూ.247 కోట్లతో వీధి దీపాలు, రూ.509 కోట్లతో పార్కుల అభివృద్ధి చేపట్టనున్నారు.

కృష్ణాజలాలతో కుప్పం సస్యశ్యామలం..!

కుప్పం నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశలో కుప్పం బ్రాంచి కెనాల్‌ ద్వారా కృష్ణా జలాలను మరింత విస్తృతంగా వినియోగించ నున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు._ శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లి వద్ద హంద్రీ–నీవా కుప్పం బ్రాంచి కెనాల్‌కు కృష్ణాజలాలు చేరిన సందర్భంగా జలహారతి ఇచ్చి శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. గత ఏడాది కుప్పం బ్రాంచి కెనాల్‌ ద్వారా కృష్ణా జలాలను తీసుకువచ్చి 133 చెరువులను నింపగలిగామని, ఇప్పుడు నియోజక వర్గంలోని సాధ్యమైన ప్రతి చిన్న నీటి వనరును కృష్ణా జలాలతో నింపి కుప్పాన్ని మరింత సస్య శ్యామలం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామ న్నారు. మొత్తం రూ.439.640 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ ప్రణాళిక ద్వారా నాలుగు మండలాల్లో 418 చిన్న నీటిపారుదల చెరువులకు కుప్పం బ్రాంచి కెనాల్‌ ద్వారా నీటిని అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్