ఫ్రెండ్లీ పోటీ తప్పదు : పిఠాపురంలో పవన్ కల్యాణ్
మనమే గెలవాలి : కుప్పంలో టిడిపి కార్యకర్తలతో చంద్రబాబు
ప్రజాశక్తి- యంత్రాంగం : టిడిపి కూటమిలో స్థానిక ఎన్నికల సెగలు రగులుతున్నాయి. ఈ ఎన్నికల్లో సీట్ల పంపిణీకి సంబంధించి జనసేన అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్థానిక ఎన్నికల్లో ఫ్రెండ్లీ పోటీ తప్పదని అనగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిడిపి కార్యకర్తలను ఉద్ధేశించి చేసిన ప్రసంగంలో ‘మనమే గెలవాలి’అని అన్నారు. మంగళవారం నాడు చోటుచేసుకున్న ఈ పరిణామం చర్చనీయంగా మారింది. కాకినాడ జిల్లా పిఠాపురంలో మంగళవారం సాయంత్రం జరిగిన జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి అంతర్గత సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తనకు జనసేన పార్టీ గౌరవం కాపాడటం అత్యంత ముఖ్యమని అన్నారు. సీట్ షేరింగ్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఆ విషయంలో తాను ఎవరితోనూ మాట్లాడటానికి కూడా సిద్ధంగా లేనని ఆయన అన్నారు.15 శాతం సీట్లకు అంగీకరించే ప్రసక్తే లేదని చెప్పారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో టిడిపి నేతలు వ్యవహరిస్తున్న తీరుపై జనసేన కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎటువంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తి కరంగా మారింది. మరోవైపు కుప్పంలోని శాంతిపురం మండలంలో టిడిపి కార్యకర్తలతో సమావేశమైన రాష్ట్ర ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ‘ఇక నుండి అన్ని ఎన్నికల్లో మనమే గెలవాలి’ అని అన్నారు. పంచాయతీలతో పాటు, మున్సిపాల్టీల్లోనూ వందశాతం స్ట్రైక్ రేట్ సాధించాలని చెప్పారు.







కామెంట్‌లు (0)