తుపాన్ సమీక్షలో సిఎం చంద్రబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ‘మురసు’ తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధతతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్రంపై తుపాను ప్రభావం, వర్షాలు, గాలుల తీవ్రత, జలాశయాల నిర్వహణ అంశాలతో పాటు వివిధ శాఖలు చేపట్టాల్సిన ముందస్తు కార్యాచరణపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆధికారులతో ఆయన ఆదివారం వర్చువల్గా సమీక్ష నిర్వహించారు. తుపాను ముప్పు నెలకొనడంతో సోమవారం తన ఢిల్లీ పర్యటనను కూడా రద్దు చేసుకున్నట్టు సిఎం వెల్లడించారు. ప్రస్తుత తుపాను సోమవారానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని, మంగళవారం ఉదయం బాపట్ల సమీపంలో తీవ్ర తుపానుగా తీరం దాటొచ్చని తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్నారు. తుపాను కారణంగా సోమవారం దక్షిణ, మధ్య కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు, 3, 4 తేదీల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అత్యంత భారీ వర్షాల అంచనా ఉన్న 20 మండలాల్లో ఏలూరు జిల్లాలో 9, కృష్ణా జిల్లాలో 5, ఎన్టిఆర్ జిల్లాలో 5, బాపట్ల జిల్లాలో ఒకటి ఉన్నాయన్నారు. నవంబర్ 3వ తేది ఏలూరు జిల్లాలో సుమారు 179 మిల్లీ మీటర్లు, కృష్ణా జిల్లాలో 163 మిల్లీ మీటర్లు, ఎన్టీఆర్ జిల్లాలో 161 మిల్లీ మీటర్లు పశ్చిమ గోదావరి జిల్లాలో 147 మిల్లీ మీటర్లు గుంటూరు జిల్లాలో 119 మిల్లీ మీటర్లు బాపట్ల జిల్లాలో 104 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వరద ముప్పు..
భారీ వర్షాల నేపథ్యంలో బుడమేరు దగ్గర 3వ తేదీన సుమారు 32,500 క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఎర్రకాల్వ, గోనెలవాగు, జల్లేరు, పంపా తదితర జలాశయాల్లో కూడా భారీ వరద వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రికి వివరించారు. తుపాను ప్రభావంతో బలమైన గాలులు వీచడం వల్ల 12 జిల్లాల్లో సుమారు 12,102 నుంచి 15,128 విద్యుత్ స్తంభాలు దెబ్బతినే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అవసరమైన మానవ వనరులు, పరికరాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి అవసరమైన సిబ్బందిని, సామగ్రిని ముందుగానే ప్రభావిత ప్రాంతాలకు తరలించి అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్ స్తంభాలు పడిపోయిన సందర్భాల్లో ఎన్ని గంటల్లో పునరుద్ధరణ చేపట్టగలుగుతాం, ఎప్పటిలోగా విద్యుత్ సరఫరా అందించగలుగుతామనే విషయంపై స్పష్టమైన కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సమాచారాన్ని ప్రజలకు కూడా తెలియజేసే పరిస్థితి ఉండాలని సూచించారు. తుఫాను ప్రభావంపై ప్రతి నాలుగు గంటలకు ఒకసారి బులెటిన్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. టెలికాం నెట్వర్క్ సంస్థలు ముందస్తు చర్యలు తీసుకుని మొబైల్ సిగ్నల్ సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్క్ సంస్థలను ముందుగానే అప్రమత్తం చేసి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై ముఖ్యమంత్రి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆదివారం రాత్రికి అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.







కామెంట్లు (0)