ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతుపాను దెబ్బకు తీవ్రంగా నష్టపోయాం... ఆదుకోండి

2 గంటల క్రితం

తుపాను దెబ్బకు తీవ్రంగా నష్టపోయాం... ఆదుకోండి
- రైతుల ఆవేదన
- నష్టాలపై కేంద్రానికి సమగ్ర నివేదిక
- కేంద్ర బృందం సభ్యులు కొల్లు రేఖా రాణి
- తూర్పు, పశ్చిమలో కేంద్ర బృందం విస్తృత పర్యటన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 09:25 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

  • రైతుల ఆవేదన

  • నష్టాలపై కేంద్రానికి సమగ్ర నివేదిక

  • కేంద్ర బృందం సభ్యులు కొల్లు రేఖా రాణి

  • తూర్పు, పశ్చిమలో కేంద్ర బృందం విస్తృత పర్యటన

ప్రజాశక్తి - కాకినాడ ప్రతినిధి, పాలకొల్లు, పెనుమంట్ర, నరసాపురం (పశ్చిమగోదావరి జిల్లా) : అర్నబ్ తుపానుతో వరి పంట పూర్తిగా దెబ్బతిని తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని తాళ్లరేవు, కాజులూరు మండలాల రైతులు కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల బృందానికి విన్నవించారు. కాకినాడ జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల బృందం ఆదివారం పర్యటించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ చిత్తరంజన్ దాస్ నేతృత్వంలోని బృందం తాళ్లరేవు మండలం పోలేకుర్రు, బాపనపల్లి, కాజులూరు మండలం కొలంక గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించింది. రైతులతో నేరుగా మాట్లాడి సాగు పెట్టుబడులు, పంట నష్టపోయిన విస్తీర్ణం, దిగుబడిపై ప్రభావం తదితర వివరాలను బృందం సేకరించింది. వరి సాగు కోసం ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు పెట్టుబడి పెట్టామని, పంట కోతకు వచ్చే సమయంలో తుపాను కారణంగా పొలాల్లో నీరు చేరి, ఈదురుగాలులకు వరి చేను నేలవాలడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు, కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పశువులకు మేత కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎండోమెంట్ భూములకు సంబంధించి శిస్తు రద్దు చేయాలని కోరారు. తక్షణమే నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. పెట్టుబడి రాయితీతో పాటు పంటల బీమా పరిహారాన్ని త్వరితగతిన అందించాలని కోరారు. రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉచిత పంటల బీమా పథకాన్ని వర్తింపజేయాలని, లేదా ప్రీమియం మొత్తాన్ని తగ్గించాలని కోరారు. ​వ్యవసాయ రంగంతోపాటు విద్యుత్, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలకు తుపాను కారణంగా జరిగిన నష్టాలను కూడా కేంద్ర బృందం పరిశీలించింది. ఈ బృందంలో వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అదనపు అభివృద్ధి కమిషనర్ ప్రశాంత్ అర్మోరికర్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ హిమాలయ గార్గ్, కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ డిప్యూటీ డైరెక్టర్ ప్రణయ్ గార్గ్ ఉన్నారు. ఈ పర్యటనలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్‌‌డి ప్రఖర్ జైన్, కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, వ్యవసాయ, రెవెన్యూ, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

పశ్చిమగోదావరిలోని పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న వ్యవసాయ, ఆక్వా, విద్యుత్, ఉద్యాన పంటలను కేంద్ర బృందం, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించి, బాధితులతో మాట్లాడింది. పంట నష్టాలను శాస్త్రీయంగా అంచనా వేయడంతో పాటు, ఉపగ్రహ చిత్రాలు, రిమోట్ సెన్సింగ్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నట్లు బృందం తెలిపింది. కొబ్బరి, అరటి తోటలకు జరిగిన నష్టాలు, ఆక్వా, తీర ప్రాంత గ్రామాలు, నివాస గృహాలు, మత్స్యకార బోట్లు, విద్యుత్ స్తంభాలు, వైర్ల ధ్వంసం వంటి వివరాలను కేంద్ర ప్రతినిధులకు కలెక్టర్‌ ‌వివరించారు. తొలుత పెనుగొండ మండలం వడలి గ్రామంలో నేలకొరిగిన వరిచేలను, ధ్వంసమైన అరటి పంటలను, పాలకొల్లు మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో విరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, తెగిపడిన వైర్లను ‌బృందం సభ్యులు పరిశీలించారు. తుఫాను ప్రభావంపై అక్కడ ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్ తిలకించారు. యలమంచిలో విద్యుత్ సబ్ స్టేషన్‌లో విద్యుత్ సామగ్రి, విద్యుత్‌ ‌పునరుద్ధరణ పనులను పరిశీలించారు. ఆర్యపేటలో తుపాను తాకిడికి విరిగిపడిన రావి చెట్టును, ధ్వంసమైన భవనాన్ని, పాలకొల్లు-నరసాపురం మార్గంలో రహదారి వెంట కూలిన వృక్షాలను పరిశీలించారు. చించినాడ రోడ్డులో దెబ్బతిన్న రొయ్యల చెరువులను, ఏరియేటర్లు, ఫీడ్ షెడ్లను పరిశీలించి ఆక్వా రైతుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. నరసాపురం సెంటర్‌లో ధ్వంసమైన విద్యుత్ టవ‌ర్‌ను, లిఖితపూడి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలపై విరిగిపడిన వృక్షాన్ని, జరిగిన నష్టాన్ని పరిశీలించారు. బియ్యపుతిప్పలో ధ్వంసమైన మత్స్యకారుల బోట్లను పరిశీలించి, ‌వారితో మాట్లాడారు. రామన్నపాలెంలో నీటమునిగిన పంట పొలాలు, కొబ్బరి చెట్లు పరిశీలించి రైతులను పంట నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొగల్తూరు మండలం కెపి పాలెం నార్త్, మెట్రేవ్ గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి, బాధితులతో మాట్లాడారు. ఈ బృందంలో రేఖారాణి కొల్లు, డాక్టర్ ఎస్.వి.ఎస్.పి శర్మ, అలోక్ జవహర్, ఎస్.కె రాకేష్ కుమార్ సింగ్ తదితరులతో పాటు ఎపి సిఆర్‌‌డిఎ అడిషనల్ కమిషనర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఉన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్