గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరాయలసీమ లిఫ్టుపై సిఎం చంద్రబాబు స్పష్టత ఇవ్వాలి

32 నిమిషాల క్రితం

‘రిగ్గింగ్‌ మాస్టర్‌’ చంద్రబాబు : జగన్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026, 08:25 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • మాజీ సిఎం జగన్‌

ప్రజాశక్తి-అమరావతిబ్యూరో : రాయలసీమ లిఫ్ట్‌ స్కీంపై, తెలంగాణలో పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం వాస్తవాలను మరుగున పరుస్తోందని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని, కానీ కాంగ్రెస్‌తో దోస్తీ రాజకీయాల కోసం మౌనంగా ఉన్నారని వైసిపి అధినేత, మాజీ సిఎం వైఎస్‌ జగన్‌‌మోహన్‌‌రెడ్డి విమర్శించారు. దీనిపై గురువారం ఎక్స్‌‌లో ప్రకటన విడుదల చేశారు. వైసిపి ప్రభుత్వ హయాంలో చేపట్టిన రాయలసీమ లిఫ్ట్‌ స్కీం కొత్త ప్రాజెక్టు కాదని, దీనికి అదనపు నీటి కేటాయింపులు లేవని, కొత్త కాల్వలు గానీ, రిజర్వాయర్లు గానీ, అదనపు ఆయకట్లు గానీ లేవని తెలిపారు. పోతిరెడ్డిపాడు నుంచి కాల్వల ద్వారా దుర్భిక్ష పరిస్థితులను తరచుగా ఎదుర్కొంటున్న రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించిన జలాలనే సమర్థవంతంగా వినియోగించుకునేందుకు చేపట్టామన్నారు. దశాబ్దాలుగా కృష్ణానది ద్వారా రాష్ట్రానికి వచ్చే నీళ్లు తగ్గిపోతున్న నేపథ్యంలో, పైనుంచి నీళ్లు రాకపోవడం ఒక సమస్య అయితే, వచ్చిన నీటిని తెలంగాణ రాష్ట్రం విద్యుదుత్పత్తి పేరుతో ఇష్టానుసారంగా దిగువకు వదిలేయడం మరొక తీవ్రమైన సమస్యగా ఉందని తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా శ్రీశైలం నుంచి పూర్తిస్థాయిలో 44 వేల క్యూసెక్కుల నీళ్లు పారాలంటే నీటి మట్టం కనీసం 880 అడుగులపైన ఉండాలని, నీటి మట్టం 854 అడుగుల దిగువకు పడిపోతే అసలు నీళ్లే పంపలేని పరిస్థితని పేర్కొన్నారు. 880 అడుగులపైన రిజర్వాయర్‌ లెవల్‌ ఎన్నిరోజులు ఉంటుందో కూడా తెలియని పరిస్థితిలో రాయలసీమ తాగునీటి, సాగునీటి అవసరాలు తీరడం అసాధ్యంగా మారిన నేపథ్యంలో దీన్ని చేపట్టామని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ శ్రీశైలంలో 800 అడుగుల నుంచే పాలమూరు-రంగారెడ్డి ద్వారా రోజుకు 1.5 టిఎంసిలు డిండి ద్వారా 0.5 రోజుకు టిఎంసి, కల్వకుర్తి ద్వారా రోజుకు 0.4 టిఎంసి, ఎస్‌ఎల్‌బిసి ద్వారా రోజుకు 0.5 టిఎంసి మొత్తంగా రోజుకు 3 టిఎంసిలు తరలించే సామర్థ్యంతో ముందుకెళ్తోందని పేర్కొన్నారు. వీటికి తోడు 800 అడుగుల నుంచే విద్యుదుత్పత్తి పేరిట నీటిని వదిలేస్తోందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా వైసిపి ప్రభుత్వ హయాంలో రాయలసీమ లిఫ్ట్‌ స్కీం చేపట్టి పోతిరెడ్డిపాడు కాల్వలోకి నీటిని ఎత్తిపోసి, అప్పటికే ఉన్న పాత రిజర్వాయర్లకు నీరందించే ఉద్దేశంతో చేపట్టామని తెలిపారు. దాదాపు పూర్తయిన రాయలసీమ లిఫ్ట్‌ పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆపేసిందని విమర్శించారు. కరువులాంటి విపత్కర పరిస్థితుల్లో హక్కుగా కేటాయించిన నీటిని కూడా వినియోగించుకునే అవకాశాన్ని దెబ్బతీసి, రాయలసీమ ప్రజల ప్రాణాధారానికే ఉరివేశారని తెలిపారు. ఎవరికీ నష్టం కలిగించని ఈ పథకంపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్