మట్టి, రాయి నింపకం, నిర్మాణ పటిష్ఠతపై ప్రత్యక్ష పరీక్షలు
నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులకు సూచన
ప్రజాశక్తి - పోలవరం : పోలవరం ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ (ఇసిఆర్‌ఎఫ్) నిర్మాణ పనుల నాణ్యతను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పిపిఎ) సిఇఒ సంజీవ్ వోహ్రా గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో మూడు గంటల పాటు దాదాపు కిలోమీటరున్నర మేర కాలినడకన పర్యటించి వివిధ దశల్లో జరుగుతున్న పనులను తనిఖీ చేశారు. నిర్మాణంలో ఉపయోగిస్తున్న మట్టి, రాయి, ఇసుక నాణ్యతతో పాటు వాటిని నింపుతున్న విధానాన్ని పరిశీలిస్తూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పటిష్టతను ప్రత్యక్షంగా నిర్ధారించుకునేందుకు కొన్ని ప్రాంతాల్లో జెసిబి సాయంతో సుమారు మీటరు లోతు వరకు తవ్వించి లోపలి పొరలను పరిశీలించారు. తొలగించిన మట్టిని తిరిగి నింపి షీప్‌ఫుట్ రోలర్‌తో చదును చేయించిన అంతరం ఏర్పడిన పటిష్టతను పరిశీలించగా, గతంలో ఉన్న గట్టిదనానికి ఎలాంటి వ్యత్యాసమూ కనిపించలేదని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా సంజీవ్ వోహ్రా మాట్లాడుతూ ఇసిఆర్‌ఎఫ్ నిర్మాణంలో ప్రతి దశలోనూ నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. మట్టి, రాయి నింపే సమయంలో పొరల మధ్య ఖాళీలు లేకుండా పటిష్ఠంగా పనులు చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. భూగర్భ జలాల ఊట, మట్టిలో తేమ శాతాన్ని గుర్తించేందుకు నిర్మాణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరికరాల పనితీరును పరిశీలించారు. అవి సక్రమంగా పనిచేస్తున్నాయా, అవసరమైన సమాచారం అందిస్తున్నాయా అనే విషయాలను సాంకేతిక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పరికరాల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
మరోవైపు కేంద్ర భూసార, నిర్మాణ సామగ్రి పరిశోధనా కేంద్రం (సిఎస్‌ఎంఆర్‌ఎస్) శాస్త్రవేత్తలు హరీంద్ర ప్రకాశ్, శ్రీహరి టి నాయర్, అమిత్ సేన్ ప్రాజెక్టు ప్రాంతంలో మూడు రోజులుగా వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. పైడిపాకతో పాటు గ్యాప్-3 ప్రాంతంలో భవిష్యత్తు నిర్మాణ పనుల కోసం నిల్వ చేసిన మట్టి నమూనాలను పరిశీలించారు. మట్టి నాణ్యత, నిర్మాణానికి అనుకూలమైన ప్రమాణాలను నిర్ధారించేందుకు కొన్ని నమూనాలను పరిశోధనా కేంద్రానికి తీసుకెళ్లారు. మూడు రోజుల పాటు నిర్వహించిన పరీక్షలు సంతృప్తికరంగా సాగినట్లు నిపుణులు వెల్లడించారు.ఈ పర్యటనలో పిపిఎ సభ్య కార్యదర్శి ఎం రఘురామ్, చీఫ్ ఇంజనీర్ ఎం రమేష్‌కుమార్, ప్రాజెక్టు ఎస్‌ఈ పి. రామచంద్రరావు, నాణ్యత విభాగం ఎస్‌ఇ నరసింహరాజు, ఇఇలు డి శ్రీనివాస్, బాలకృష్ణమూర్తి, ప్రేమ్‌చంద్, డిఇలు నిర్మల, శ్రీకాంత్, విజయ్, మల్లికార్జున, పటేల్, ఎంఇఐఎల్ తరఫున జనరల్ మేనేజర్ ఎ గంగాధర్‌కుమార్, డిజిఎంలు గుట్టపాటి శంకరయ్య, మురళి పమ్మి పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)