ఎఐసిసి ఇన్‌ఛార్జి పివి మోహన్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఎఐసిసి ఇన్‌ఛార్జి పివి మోహన్ తెలిపారు. ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ఓటర్ల జాబితాల్లో జరుగుతున్న అవకతవకలను అరికట్టాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యాన ‘రాజ్యాంగాన్ని రక్షించండి – దేశాన్ని కాపాడండి, ఓటును సంరక్షించండి’ అనే నినాదంతో రాష్ట్రస్థాయి ‘సంవిధాన్ రక్షా మార్చ్’ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ పేరుతో అర్హులైన ఓటర్లను ఓటు హక్కుకు దూరం చేసే చర్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ప్రజాస్వామ్యానికి, ఓటర్ల హక్కులకు భంగం కలిగించే ఈ ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జెడి శీలం, మరో వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ మాట్లాడుతూ.. ఓటు హక్కును పరిరక్షించేందుకు చేపట్టిన ‘ఓటు రక్షక్’ కార్యక్రమంలో భాగంగా ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో ఓటర్ల జాబితాలను పరిశీలించి, తొలగించబడిన అర్హులైన ఓటర్లకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివి, రాజ్యాంగ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎల్ ఈశ్వరరావు, కె శివాజి, వి గురునాథం, ప్రకాష్, ఎన్ నరసింహారావు తదితరులు పాల్లొన్నారు.






కామెంట్‌లు (0)