సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

వనరుల వియోగంతో సమగ్రాభివృద్ధి

2 గంటల క్రితం

cm chandrababu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 09:49 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌‌గా రాయలసీమ

- ప్రైవేట్ భాగస్వామ్యంతో 3 రీజియన్లలో స్పోర్ట్స్ సిటీలు

- 51.88 చదరపు కి.మీ. విస్తీర్ణంలో ‘వైజాగ్ బే సిటీ’

- 6 నెలల్లో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయండి

- ఎకనామిక్ రీజియన్లపై సమీక్షలో సీఎం చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అన్ని వనరులను సమగ్రంగా సద్వినియోగం చేసుకున్నప్పుడే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఉద్యానవన పంటల సాగుతో తలసరి ఆదాయంలో సరికొత్త రికార్డ్ సృష్టించిన కడప జిల్లా లింగాలం మండలం స్ఫూర్తితో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలని సూచించారు. తిరుపతి ఎకనామిక్ రీజియన్ పురోగతికి హార్టికల్చర్ గ్రోత్ ఇంజిన్ అవుతుందని 25కు పైగా ఉద్యాన ఉత్పత్తులు సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పూర్వోదయ పథకం కింద ఉద్యానవన రంగానికి ఊతమిస్తాయని చెప్పారు. పారిశ్రామికంగా అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతాల కన్నా...సీమలోని ఒక మండలంలో ప్రజల తలసరి ఆదాయం అధికంగా ఉండటాన్ని అధ్యయనం చేయాలన్నారు. కడప జిల్లా లింగాల మండలంలో ప్రజలు రూ.7.30 లక్షలు తలసరి ఆదాయం కలిగి ఉండడం ఉద్యాన పంటల సాగు వల్ల కలిగే లాభాలకు నిదర్శనమని స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మూడు ఎకనామిక్ రీజియన్లపై అధికారులతో ముఖ్యమంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు. విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా 3 రీజియన్ల అభివృద్ధికి కార్యాచరణపై పలు మార్గదర్శకాలను సూచించారు. ఇప్పటికే విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రణాళిక ఆవిష్కరించగా...6 నెలల్లో అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్ల మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ సిటీలు

అమరావతి, తిరుపతి, విశాఖలో అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపోందించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో మూడు ప్రాంతాల్లోనూ స్పోర్ట్స్ సిటీల అభివృద్ధి జరగాలన్నారు. సూర్య లంక బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని సీఎం నిర్దేశించారు. తీరప్రాంత పర్యాటకం, గ్లోబల్ బిజినెస్-ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్, గ్లోబల్ టాలెంట్-ఎలైట్ లివింగ్ అనే 3 పిల్లర్లపై ‘వైజాగ్ బే సిటీ’ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విశాఖ ఎకనామిక్ రీజియన్‌లోని 51.88 చదరపు కి.మీ. విస్తీర్ణంలో ‘వైజాగ్ బే సిటీ’ అభివృద్ధికి పెట్టుబడులు పెట్టేలా ప్రముఖ సంస్థల్ని ఆహ్వానించాలన్నారు. బే సిటీలో 3,291 ఎకరాల ప్రభుత్వ భూమి లభ్యత ఉందని గుర్తించినట్టు ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అలాగే విశాఖ ఎకనామిక్ రీజియన్లో ఇప్పటికి మొత్తం 49 ప్రాజెక్టులు రాగా...వీటిలో 18 ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యాయని, మరో 12 త్వరలో గ్రౌండ్ కానున్నాయని అధికారులు వివరించారు.

అమరావతి ఎకనామిక్ రీజియన్

రాష్ట్ర జనాభాలో 32 శాతం అమరావతి ఎకనామిక్ రీజియన్‌లో నివసిస్తున్నారని... భౌగోళికంగా 33 శాతం విస్తరించి ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. భౌగోళికంగా రాష్ట్రానికి మధ్యలో ఉండటం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉండటం కలిసొచ్చే అంశమని అన్నారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం...మొత్తం 9 జిల్లాలు అమరావతి ఎకనామిక్ రీజియన్ పరిధిలో ఉండగా... వీటిలో అన్నింటికన్నా కృష్ణా జిల్లా తలసరి ఆదాయంలో ముందుందని అధికారులు చెప్పారు. జిల్లాల వారీగా రీజియన్ అభివృద్ధి జరిగేలా వర్క్ షాపులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

అమరావతి, విశాఖ రీజియన్లతో పోటీ పడేలా..

ఖనిజ సంపద నుంచి హార్టికల్చర్ వరకు...ఫుణ్యక్షేత్రాల నుంచి పర్యాటక ప్రాంతాల వరకు రాయలసీమకు ఉన్న అనుకూలతను మార్కెటింగ్ చేసుకోవాలని సిఎం పేర్కొన్నారు. విశాఖ, అమరావతి రీజియన్లతో పోటీ పడేలా తిరుపతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి జరగాలన్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీశైలం వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు, ఐఐటీ వంటి విద్యా సంస్థలు, గోల్డ్, ఐరన్ ఓర్, లైమ్ స్టోన్ వంటి ఖనిజ వనరులు రాయలసీమ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. గండికోట, హార్సిలీహిల్స్, తలకోన వంటి పర్యాటక ప్రాంతాలను ఇంటిగ్రేట్ చేయాలన్నారు. తిరుపతి ఎకనమిక్ రీజియన్ వాటాగా 0.90 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలని లక్ష్యం పెట్టుకున్నట్టు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. టీఈఆర్ ప్రణాళికల కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశామన్నారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఈ మూడు రీజియన్ల ప్రత్యేక అధికారులు ముఖేష్ కుమార్ మీనా, సురేశ్ కుమార్, యువరాజ్ లు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్