ఐద్వా డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తిరుపతిలో బిజెపి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ నివాసంలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపి, మహిళ మృతికి బాధ్యులైన వారిని తక్షణమే అరెస్టు చేయాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.శ్రీదేవి, వి. సావిత్రి బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనను పోలీసులు హడావుడిగా ఆత్మహత్యగా నమోదు చేయడం, కనీసం పోస్టుమార్టం నిర్వహించకుండానే దహన సంస్కారాలు పూర్తిచేయడం అనేక అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. మహిళ మృతి చెందినప్పుడు పాటించాల్సిన చట్టపరమైన నిబంధనలను పక్కనపెట్టి, మృతదేహానికి పోస్టుమార్టం కూడా నిర్వహించకుండా అంత్యక్రియలు ఎలా పూర్తిచేశారని ప్రశ్నించారు. ఈ కేసులో కీలకమైన ఆధారాలను సేకరించకుండానే పోలీసులు కేసును ముగించే ప్రయత్నం చేయడం తీవ్ర అభ్యంతరకరమని విమర్శించారు. తిరుపతి జిల్లా బిజెపి అధ్యక్షుడి ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకోవడం, ఆయనకు మృతురాలితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు రావడం, వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేసును మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందన్నారు. సామంచి శ్రీనివాస్‌ను తక్షణమే అరెస్టు చేసి, ఆయన పాత్రపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. మృతురాలి కుటుంబ సభ్యులకు న్యాయం చేయడంతో పాటు, పోస్టుమార్టం నిర్వహించకపోవడం, అంత్యక్రియలను హడావుడిగా పూర్తిచేయడం వంటి అంశాలపై బాధ్యులైన పోలీసు అధికారుల పాత్రను కూడా విచారించాలని డిమాండ్ చేశారు.







కామెంట్‌లు (0)