పరిశీలించిన పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్‌రాజు
ప్రజాశక్తి- పెందుర్తి (విశాఖపట్నం) : కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసి బిజెపి కార్యాలయ నిర్మాణం చేస్తున్నా టిడిపి కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు ఆరోపించారు. జివిఎంసి 117వ వార్డు పరిధి చినముసిడివాడ సర్వే నంబర్ 196/1లో సుమారు వెయ్యి గజాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన బిజెపి కార్యాలయ స్థలాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదీప్ రాజు మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఇదే స్థలంలో సుమారు తొమ్మిది షెడ్లు నిర్మించగా, రెవెన్యూ అధికారుల ద్వారా వాటిని తొలగించామని తెలిపారు. జివిఎంసి ఎన్నికల సమయంలో గుట్టుచప్పుడు కాకుండా సుమారు రూ.ఐదు కోట్ల విలువైన వెయ్యి గజాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి బిజెపి కార్యాలయాన్ని నిర్మించారని, అదే ప్రాంతంలో సర్వే నంబర్ 164/10 లో మరో 1,500 గజాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి, ఆయా భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి, ఈ అంశంపై ఆందోళన చేపడతామని హెచ్చరించారు.







కామెంట్లు (0)