స్వదేశీ నౌకా నిర్మాణం, మరమ్మతులు, రక్షణ సాంకేతికతలకు సహజ కేంద్రం
డిఆర్‌డిఒ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బాలమురళీకృష్ణన్
ప్రజాశక్తి -ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : భారత నౌకాదళానికి అవసరమైన రక్షణ పరికరాల స్వదేశీ తయారీ, నౌకా నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణతోపాటు నీటి అడుగున వినియోగించే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధికి విశాఖపట్నం అనువైన కేంద్రంగా ఉందని డిఆర్‌డిఒ నేవల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్ బాలమురళీకృష్ణన్ పేర్కొన్నారు. నౌకాదళ తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయం, డిఆర్‌డిఒ పరిశోధన సంస్థలు, హిందుస్థాన్ షిప్‌యార్డ్ వంటి కీలక సంస్థలు ఇక్కడ ఉండడం విశాఖకు ప్రత్యేక గుర్తింపునిస్తోందన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ), సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్‌ఐడిఎం) సంయుక్తంగా బుధవారం గాదిరాజు ప్యాలెస్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన తొలి రక్షణ సాంకేతిక ప్రదర్శన ‘డెఫ్కోర్-2026’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలమురళీకృష్ణన్ మాట్లాడుతూ రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలంటే నాణ్యత, విశ్వసనీయతతో కూడిన స్వదేశీ సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. డిఆర్‌డిఒ, పరిశ్రమల మధ్య సంబంధాలు కేవలం కొనుగోలు, సరఫరా స్థాయిని దాటి ఉమ్మడి సాంకేతిక అభివృద్ధి భాగస్వామ్యంగా మారుతున్నాయని తెలిపారు. పెద్ద పరిశ్రమలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, అంకుర సంస్థలు రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. ఈ సంస్థలకు నౌకాదళ అవసరాలకు తగిన భాగస్వాములను గుర్తించేందుకు డెఫ్కోర్ వేదికగా ఉపయోగపడుతుందన్నారు.
హిందుస్థాన్ షిప్‌యార్డ్ విశ్రాంత సిఎండి రియర్ అడ్మిరల్ చంద్రశేఖరన్ రఘురామ్ మాట్లాడుతూ తూర్పు నౌకాదళ కమాండ్, నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లేబొరేటరీ, పారిశ్రామిక సంస్థల సహకారంతో విశాఖను ఆసియాలోనే ప్రముఖ సముద్ర రక్షణ పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యమన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో నౌకాదళ అవసరాలను తీర్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. సిఐఐ ట్రేడ్ ఫెయిర్స్ కౌన్సిల్ చైర్మన్ బి త్యాగరాజన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న సిఐఐ, ఎస్‌ఐడిఎం పారిశ్రామిక నెట్‌వర్క్‌ను వినియోగించుకుని రక్షణ రంగ అవసరాలకు పరిశ్రమల సామర్థ్యాలను అనుసంధానించడమే డెఫ్కోర్ లక్ష్యమని తెలిపారు. ఇది కేవలం ప్రదర్శనకే పరిమితం కాకుండా రక్షణ సంస్థలు, పరిశ్రమల మధ్య వ్యాపార, సాంకేతిక భాగస్వామ్యాలకు మార్గం సుగమం చేస్తుందని పేర్కొన్నారు. ఎస్‌ఐడిఎం ఎపి చైర్మన్ జె శ్రీనివాసరాజు మాట్లాడుతూ దేశీయ రక్షణ ఉత్పత్తి, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో పరిశోధన, అభివృద్ధి, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం, బలమైన సరఫరా వ్యవస్థలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విభాగం భవిష్యత్ కార్యాచరణ, ప్రాధాన్యతలపై చర్చించారు. సిఐఐ ఆంధ్రప్రదేశ్ మాజీ చైర్మన్, ఫ్లూయెంట్‌గ్రిడ్ ఎండి, సిఇఒ మురళీకృష్ణ గన్నమనేని తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా రక్షణ పరిశోధన, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో డిఆర్‌డిఒ, నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లేబొరేటరీ డైరెక్టర్ డాక్టర్ అబ్రహం వెరూగీస్ మాట్లాడుతూ నీటి అడుగున వినియోగించే సాంకేతిక పరిజ్ఞానం, నేవిగేషన్, క్వాంటం వ్యవస్థల అభివృద్ధిని వేగవంతం చేయాలని సూచించారు. నౌకాదళం, పరిశ్రమలు, అంకుర సంస్థల మధ్య సమన్వయం దేశ రక్షణ స్వావలంబనకు కీలకమని ఐఎన్ఎస్ విశ్వకర్మ కమాండింగ్ అధికారి కమోడోర్ అమిత్ రే పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తూర్పు నౌకాదళ కమాండ్ నుంచి 100 మందికి పైగా సభ్యులు హాజరయ్యారు.







కామెంట్లు (0)