పార్వతీపురం కలెక్టరు వ్యాఖ్యలపై ఎస్ఎఫ్ఐ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పార్వతీపురం మన్యం జిల్లాలో గురుకుల పాఠశాలల సమస్యలను ప్రశ్నించిన తల్లిదండ్రుల పిల్లలకు టిసిలిచ్చి పంపిస్తామని జిల్లా కలెక్టరు బెదిరింపు ధోరణిలో వ్యాఖ్యానించడం అప్రజాస్వామికమని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ తెలిపింది. ఈ చర్యను ఖండిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పి రామ్మోహన్, కె ప్రసన్నకుమార్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు, ప్రభుత్వం సమస్యలను ప్రశ్నించే తల్లిదండ్రులను బెదిరించడం, రాజకీయ పార్టీలతో ముడిపెట్టడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని తల్లిదండ్రులు కోరడం తప్పా? అని ప్రశ్నించారు. ఇప్పటికే ఆ పాఠశాలలో అనేక సమస్యలు ఉన్నాయని, ఎస్ఎఫ్ఐ నిర్వహించిన వివిధ రకాల సర్వేల్లో సమస్యలు బయటకొచ్చాయని, వీటిని పరిష్కరించాలని అనేకసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. గతేడాది ఇదే పాఠశాలలో దాదాపు 180 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై హాస్పిటల్లో చేరిన సంగతి కలెక్టరుకు గుర్తు లేదా? అని ప్రశ్నించారు. మృతి చెందిన ఇద్దరు విద్యార్థులకు ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వలేదని, వారి కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం కలెక్టరు ఏ ప్రయత్నం చేశారని ప్రశ్నించారు. మన్యం జిల్లాలో గురుకులాలు, గిరిజన ఆశ్రమ, కెజిబివిల్లో గతేడాది మృతి చెందిన 17 మంది విద్యార్థులకు ఏం న్యాయం చేశారని ప్రశ్నించారు. ఈ ఏడాది ఇప్పటికీ 9 మంది విద్యార్థులు పార్వతీపురం మన్యం జిల్లా అంతటా వివిధ రకాల కారణాలతో మరణించారని తెలిపారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించాల్సిన ప్రభుత్వమే వారి తల్లిదండ్రులను భయపెట్టడం దుర్మార్గమని పేర్కొన్నారు. కలెక్టరు తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకొని తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలని, గురుకుల పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే గిరిజన విద్యార్థులను, తల్లిదండ్రులను పెద్దయెత్తున సమీకరించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
తల్లిదండ్రుల ఆత్మగౌరవం దెబ్బతీసేలా కలెక్టర్ వ్యాఖ్యలు : కెవిపిఎస్
తల్లిదండ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కలెక్టరు వ్యాఖ్యలు ఉన్నాయని కెవిపిఎస్ ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మరో ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.







కామెంట్లు (0)