అమరావతి : సముద్రంలో బోటు గల్లంతయిన ఘటనలో ... మత్స్యకారుల ఆచూకీ లభించే వరకూ గాలింపు కొనసాగించాలి అని సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడలరేవు, దుమ్మలపేట, వాసలతిప్ప గ్రామాలకు చెందిన మత్స్యకారుల బోటు సముద్రంలో గల్లంతైన ఘటనపై సిఎంఒ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. బోటులో ఉన్న 8 మంది మత్స్యకారుల కోసం చేపట్టిన గాలింపు చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన బోటు, మత్స్యకారుల ఆచూకీ లభించే వరకూ గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఆగస్టు 3న ఉదయం 10 గంటల సమయంలో ఓడలరేవు జెట్టి నుంచి మత్య్సకారుల బోటు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిందని అధికారులు వివరించారు. ఉదయం 11 గంటల వరకు కుటుంబసభ్యులతో ఫోన్ ద్వారా సంబంధాలు కొనసాగగా, ఆ తర్వాత ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. బోటులో వీహెచ్‌ఎఫ్ సెట్‌తో పాటు మత్స్యకారుల వద్ద మొబైల్ ఫోన్లు కూడా ఉన్నట్లు అధికారులు వివరించారు. అదే రోజు సుమారు సాయంత్రం 6 గంటల సమయంలో బోటు చేపల వేట ప్రాంతానికి చేరుకుని ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. 12వ తేదీ నాటికి బోటు తిరిగి రావాల్సి ఉన్నా రాలేదని... దీంతో వెంటనే జాలర్ల ఆచూకీ కోసం ప్రత్యేకంగా గాలింపు చేపట్టామని అధికారులు తెలిపారు. కోస్ట్‌గార్డ్ నౌకలను అప్రమత్తం చేసి గాలింపు చేపడుతున్నట్లు కోస్ట్‌గార్డ్ కమాండెంట్ తెలిపినట్లు అధికారులు వివరించారు. కాకినాడ, భైరవపాలెం, విశాఖపట్నం, పారాదీప్ ప్రాంతాలకు చెందిన మత్స్యకారుల బోట్లను కూడా అప్రమత్తం చేసి గల్లంతైన బోటు ఆచూకీపై సమాచారం సేకరిస్తున్నామన్నారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలతో అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, గాలింపు చర్యలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి తెలియజేయాలని సిఎం ఆదేశించారు. వారి ఆచూకీ కోసం అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వినియోగించాలని, అవసరమైన ప్రతి చర్యను సమన్వయంతో చేపట్టాలని స్పష్టం చేశారు. బోటు ఆచూకీ లభించే వరకు కోస్ట్‌గార్డ్, మత్స్యశాఖ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో గాలింపు కొనసాగించాలని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసానిచ్చారు.
మత్స్యకారుల ఆచూకీ లభించే వరకూ గాలింపు కొనసాగించండి : సిఎం చంద్రబాబు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 18, 2026, 10:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)