సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు
ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్ : రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అన్ని రకాల కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం కోరుతూ చిత్తూరులో ధర్నా చౌక్ వద్ద శిబిరంలో చేపడుతున్న సమ్మె నాలుగవ రోజుకి చేరుకుంది. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు వారి సమ్మెకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాలుగా వైద్య రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ను పర్మినెంట్ చేయకపోవడం దారుణమని, వారికి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని అడుగుతున్నారని అన్నారు. సెలవులు, ప్రమాద బీమా అలాంటి సౌకర్యాలు కూడా కల్పించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వైద్యరంగం చాలా కీలకమైన రంగమని, ఈ రంగంలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు ఉండకూడదని అన్నారు. . అయితే చట్టం ప్రకారం మూడు నెలలు పనిచేసిన వారిని పర్మినెంట్ చేయాలని వున్నప్పటికీ సంవత్సరాల నుండి వారితో వెట్టిచాకరు చేయించుకుంటూ అతి తక్కువ వేతనాలు ఇవ్వడం ప్రభుత్వానికి తగదన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా వారి సమస్యలు పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. చదువుకున్న యువతీ యువకులు ఈ రంగంలో పని చేస్తుంటే వారి సమస్యలను పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యం చేయడం తగదన్నారు.
కెవిపిఎస్ మద్దతు
వైద్యరంగంలో కాంట్రాక్ట్ పద్ధతుల పనిచేస్తున్న వారిలో అత్యధికలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నారని, మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని అన్నారు. వీరు సమస్యలు పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యం వహించడమంటే ఇది వివక్షలో భాగమేనని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి సురేంద్రన్ అన్నారు. వెంటనే వారి సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.







కామెంట్‌లు (0)