తన భర్త పేరుతో ఉన్న డీకేటీ భూమిని తిరిగి ఇప్పించాలని అధికారులకు వినతి
ప్రజాశక్తి - బైరెడ్డిపల్లి : మండలంలోని ధర్మపురి పంచాయతీ పరిధిలో భూమి పట్టా మార్పు వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని ధర్మపురి గ్రామానికి చెందిన దళిత మహిళ, మాజీ ఎంపీటీసీ రత్నమ్మ వీరు అధికారులను కోరారు. తన భర్త పేరుతో ప్రభుత్వం మంజూరు చేసిన డీకేటీ భూమిని నకిలీ పత్రాల ద్వారా మరో వ్యక్తి పేరుపైకి మార్చుకున్నారని ఆమె ఆరోపించారు.
ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 138/3లో 62 సెంట్ల భూమిని తన భర్త నారాయణప్పకు 1986 ఏప్రిల్ 4వ తేదీన డీకేటీ పట్టా నంబర్ 2872/4 ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు. అయితే తూర్పుగడ్డ గ్రామానికి చెందిన లేటు సుబ్రహ్మణ్యం కుమారుడు సుధాకర్ నకిలీ పత్రాలు సృష్టించి, రెవెన్యూ సిబ్బంది సహకారంతో భూమిని తన పేరుపై నమోదు చేయించుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం సర్వే నంబర్ 138/0.59గా సుధాకర్ పేరుపై పాసుపుస్తకం జారీ కావడంతో పాటు ఆన్‌లైన్‌లోనూ భూమి వివరాలు నమోదయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త పేరుతో ప్రభుత్వం మంజూరు చేసిన భూమిని ఇతరుల పేరుపైకి ఎలా మార్చారని ప్రశ్నించిన ఆమె, ఈ వ్యవహారంలో రెవెన్యూ సిబ్బంది పాత్రపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. సామాజికంగా బలహీన వర్గానికి చెందిన మహిళ కావడంతో తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆమె.. జిల్లా ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించి భూమికి సంబంధించిన పాత రికార్డులు, డీకేటీ పట్టా, పాసుపుస్తకాలు, ఆన్‌లైన్ నమోదులను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. విచారణ జరిపి అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, తన భర్త పేరుతో మంజూరైన భూమిపై తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దళిత మహిళకు న్యాయం జరిగేలా జిల్లా అధికారులు స్పందించి, భూమి వివాదాన్ని నిష్పక్షపాతంగా పరిష్కరించాలని ఆమెతో పాటు స్థానికులు కోరుతున్నారు.







కామెంట్‌లు (0)