బడి, గుడి, బస్టాండ్ పక్కన, జనావాసాల మధ్య ఉన్న బ్రాందీ షాపు షాపును వెంటనే తొలగించండి
ప్రజాశక్తి-గోకవరం : మద్యాన్ని ఆదాయ వనరుగా చూడొద్దని, గుడి, బడి, జనవాసాల మధ్య ఉన్న బ్రాందీ షాపులను వెంటనే తొలగించాలని మద్యం మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ ఎన్ సూర్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం గోకవరం బస్టాండ్ ఎదురుగా వాసుదేవర వీధిలో బ్రాందీ షాపులను తొలగించాలని, సారాను అరికట్టాలని మహిళలతో మెయిన్ రోడ్లో ర్యాలీ చేపట్టి, నిరసన వ్యక్తం చేశారు. బ్రాందీ షాపులను వెంటనే తొలగించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎన్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. బ్రాందీ షాపులను బారుగా మార్చి అమ్మకాలు జరుపుతున్నారని, దీనివలన విద్యార్థులు, మహిళలు, ప్రజలు షాప్ పక్కన నుండి నడవాలంటేనే భయపడుతున్నారని అన్నారు. ఉదయం 9 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు షాపు వద్ద పెద్ద పెద్ద కేకలు, అరుపులతో నిత్యం గందరగోళంగా ఉంటోందని, దీంతో చుట్టుపక్కల ఉన్న వారికి ఎప్పుడు ఏమవుతుందో తెలియడం లేదని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి బ్రాందీ షాప్ లను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో' స్థానిక మహిళలు మైలపాల బేబీ, డి. దుర్గా, పి నాగలక్ష్మి, జి. రాఘవ, ఎం. నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)