ప్రజాభిప్రాయాలు తీసుకోకుండా భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయడం సరికాదు….
ప్రభుత్వ విధానాన్ని తప్పుపట్టిన సీపీఎం నాయకులు ….
ప్రజాశక్తి - భోగాపురం : ఏడాదికి మూడు పంటలు పండే పచ్చని పంట పొలాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుకు భూములు సేకరించడం ఎంతవరకు సమంజసమని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు టీవీ రమణ ప్రశ్నించారు. భోగాపురం, పోలిపల్లి గ్రామాల్లో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న పోరాటానికి సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో మీడియా సమావేశం నిర్వహించి, గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీవీ రమణ మాట్లాడుతూ.. భోగాపురం ఈస్ట్, వెస్ట్, పోలిపల్లి ప్రాంతాల్లో రైతుల నుంచి మొత్తం 830 ఎకరాల భూమిని సేకరించి రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడాన్ని సీపీఎం విజయనగరం జిల్లా కమిటీ వ్యతిరేకిస్తోందన్నారు. స్థానిక ప్రజల అభిప్రాయాలు, రైతుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా భూసేకరణ ప్రక్రియను కొనసాగించడం సరికాదన్నారు. డేటా సెంటర్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, తమ భూములను ఇచ్చేందుకు ఇష్టపడటం లేదని స్పష్టం చేస్తూ నిరసనలు చేపడుతున్నారని తెలిపారు. రైతుల అభ్యంతరాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల స్థానిక ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పచ్చని పంట పొలాల్లో డేటా సెంటర్ ఏర్పాటు వల్ల వ్యవసాయ భూములకు నష్టం కలగడంతో పాటు నీటి వినియోగం పెరిగి పర్యావరణ సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. స్థానికులకు ఉపాధి కల్పన, ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని భూసేకరణ నోటిఫికేషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రతిపాదిత డేటా సెంటర్ ఏర్పాటును నిలిపివేయాలని కోరారు. భూములను కాపాడుకునేందుకు రైతులు చేస్తున్న పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని వారికి అండగా నిలుస్తామని, రైతుల హక్కుల పరిరక్షణ కోసం ఆందోళనలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం సభ్యులు బి. నారాయణ, ఎన్.వి. రమణ పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)