శుక్రవారం, 09 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'మాపొట్ట కొట్టొద్దు..'

1 గంట క్రితం

gnt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026, 03:57 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

దొండపాడులో వ్యాపార దుకాణాల తొలగింపుకు సి ఆర్ డి ఎ అధికారుల యత్నం

-ధౌర్జన్యం తగదంటూ అడ్డుకున్న చిరు వ్యాపారులు

ప్రజాశక్తి - తుళ్లూరు : రాజధాని అమరావతి పరిధిలోని దొండపాడులో రోడ్డు పక్క దుకాణాలను తొలగించేందుకు సి ఆర్ డి ఎ అధికారులు శుక్రవారం సమయత్తమయ్యారు. ప్రొక్లయినర్ ను దుకాణాల వద్దకు తీసుకొచ్చారు. పోలీసులను మోహరించారు. సి ఆర్ డి ఎ అధికారుల తీరుపై చిరు వ్యాపారులు, గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం కారణంగా పొలం పనులు లేవని, బతుకు తెరువు కోసం బ్యాంకుల్లో అప్పు చేసి దుకాణాలు పెట్టుకొని కొద్దిపాటి వ్యాపారం చేసుకుంటుంటే వాటిని కూల్చుతామనడం అన్యాయమని వాపోయారు. దుకాణాలలో అమ్మకానికి వేల రూపాయలు పెట్టి తెచ్చిన సరుకు ఉందని, అదంతా నేలపాలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 'మేమంతా దుకాణాల ముందు కూర్చుంటాం..మమ్మల్ని తొక్కుకుంటూ పొమ్మంటూ..'కన్నీళ్ల పర్యంమయ్యారు. ఒక పక్క ప్రభుత్వం చిన్న చిన్న వ్యాపారులు చేసుకోండి..ప్రోత్సహిస్తామని చెబుతుంటే దుకాణాలు కూల్చడానికి రావడం ఏమిటని అధికారులను నిలదీశారు. దీనిపై సి ఆర్ డి ఎ డెవలప్ మెంట్ అండ్ ప్రమోషన్ అధికారి వెంకటరమణ, జిల్లా అగ్నిమాపక శాఖాధికారి హనుమంతరావు మాట్లాడుతూ.. సుమారు 20 దుకాణాలు అక్రమంగా ఏర్పాటు చేశారని, సదరు స్థలం ప్రభుత్వానికి చిందినదని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారని చెప్పారు. దీంతో దుకాణాలను స్వచ్చందంగా తొలగించాలని 20 మందికి నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. దుకాణాల ఏర్పాటుకు ప్రత్యామ్నాయ స్థలాల కేటాయింపు విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. దుకాణాలు తొలగించాల్చిందే నని అనడంతో కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. సి ఆర్ డి ఎ సభ్యులు మైనేని గిరిజ, నెలకుదిటి వెంకటపతి రావు మాట్లాడుతూ.. వ్యవసాయ పనులు లేక ఉపాధి కోసం కొట్లు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటుంటే వారి పొట్టలు కొట్టడం అన్యాయమన్నారు. దుకాణాల వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని, ఒక్కరో,ఇద్దరో గిట్టక అక్కసుతో ఫిర్యాదు చేస్తే చర్యలకు ఉపక్రమించడం మంచిది కాదన్నారు. సి ఆర్ డి ఎ అధికారులు రాజధాని అమరావతిలో ఇలాంటి భయానక వాతావరణం సృష్టించడం ప్రభుత్వానికి నష్టదాయకమని అన్నారు. దీంతో అధికారులు మిన్నకుండి పోయారు. చిరు వ్యాపారులు,గ్రామస్తులు రాయపూడిలోని సి ఆర్ డి ఎ కార్యాలయంకు వెళ్లి కమీషనర్ కు వినతిపత్రం అందజేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్