నిరసనకు ప్రజా సంఘాల మద్దతు
ప్రజాశక్తి -ఏలేశ్వరం: ఇటీవల విధి నిర్వహణలో ఉన్న ప్రత్తిపాడు ప్రజాశక్తి విలేకరిపై అమానుష దాడిని ఖండిస్తూ ఏలేశ్వరం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రజా సంఘాలు స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు స్వర్ణ పూడి శ్రీనివాసరావు, శిడగం మాధవలు మాట్లాడుతూ.. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే విలేకరులపైన దాడులు పెరిగాయని అన్నారు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న అరాచక శక్తులను అణచివేసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. నిజాన్ని నిర్భయంగా అక్రమాలను వెలికి తీసే విలేకరులపై దాడులు చేయడం అన్యాయమని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ లో నాలుగో స్తంభం గా ఉన్న మీడియా హక్కులను కాలరాయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించవలసిన బాధ్యత ఉందన్నారు. నేటి వ్యవస్థలో భూ ఆక్రమణలు, దందాల పర్వం యధేచ్చగా కొనసాగుతుందని, ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకు మద్దతు తెలిపిన సిపిఎం మండల కార్యదర్శి పాకలపాటి సోమరాజు మాట్లాడుతూ.. ప్రత్తిపాడు మండలం లంపకలోవలో డి పట్టా భూమిలో అక్రమార్కులు మట్టి తవ్వకాలు, అక్రమ నిర్మాణాలు చేపట్టంపై వార్త కవరేజ్ కి వెళ్ళిన రమేష్ పై తీవ్ర దాడిని ఖండిస్తున్నామన్నారు. సిపిఐ ( ఎంఎల్) వినోద్ మిశ్రా పార్టీ నాయకులు కందుల ప్రసాద్, గండేటి నాగమణి మాట్లాడుతూ .. వ్యవస్థలో అన్యాయాలు, అక్రమాలు పెరిగిపోయాయని, భూ దందాల జోరు ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిందని అన్నారు. విలేకరులు వ్యవస్థ ఉండబట్టే అక్రమాలు, అన్యాయాలు వెలుగు చూస్తున్నాయని అన్నారు. అనంతరం తహసిల్దార్ కే కీర్తికి వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి శ్రీనివాసరావు, షేక్ హస్సేన్, సాలా మల్లికార్జునరావు, అడపా దుర్గారావు, మువ్వల శ్రీను, మూరా రాజశేఖర్, ఆకుల శివాజీ, దాసరి కృష్ణ,గొల్లపల్లి రాజబాబు, ఒక్కలంక ప్రసాద్ ప్రజా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)