శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పంట నష్టం అంచనా వేగవంతం..

1 గంట క్రితం

cm chandrababu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026, 11:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- సిఎం చంద్రబాబు ఆదేశం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మురసు తుపాను ‌వల్ల నష్టపోయిన పంట అంచనాల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేశారు. మురసు తుపాను ప్రభావం, తదనంతర సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న పరిహారంపై శనివారం క్యాంప్ కార్యాలయంలో సిఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్, రెవెన్యూ, విద్యుత్, వ్యవసాయం వంటి కీలక శాఖల అధికారులతో మాట్లాడిన ఆయన క్షేత్రస్థాయిలో చేపడుతున్న సహాయ పునరావాస చర్యలపై ఆరా తీశారు. మురసు తుపాను ధాటికి కూలిపోయిన విద్యుత్ స్తంభాలు, పునరుద్ధరణ పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీతో పాటు తక్షణ ఆర్థిక సాయం అందించే అంశంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న ఉద్యాన పంటలకు సంబంధించి దాదాపు 92 శాతం మేర అంచనాలు పూర్తయ్యాయని, వ్యవసాయ పంటలకు సంబంధించి ఈ నెల 9వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో నష్టాల అంచనా వేసే ప్రక్రియ ముగుస్తుందని అధికారులు వెల్లడించారు.

అర్నబ్ తుపాను వల్ల సుమారు 30 వేల విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని, అన్ని గ్రామాలకూ విద్యుత్ పునరుద్ధరించినట్టు విద్యుత్‌శాఖ అధికారులు ‌తెలిపారు. 3.82 లక్షల కుటుంబాలకు తుపాను సహాయక చర్యల్లో భాగంగా నిత్యావసర సరుకులను అందించామని, ఆదివారంలోపు పూర్తిస్థాయిలో పంపిణీ పూర్తి చేస్తామని పౌర సరఫరాలశాఖ అధికారులు వెల్లడించారు. మార్కెట్‌లో నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై కూడా సిఎం చంద్రబాబు ఆరా తీశారు. ఉల్లిపాయలు, బియ్యం, పామాయిల్, గోధుమ పిండి, కందిపప్పు వంటి వాటి ధరలను నియంత్రించడంతోపాటు కొన్ని నిత్యావసరాలను రేషన్ దుకాణాల్లో అందించే ఏర్పాట్లు ఎంత వరకొచ్చాయని అడిగారు. కిలో రూ.35కే ఉల్లిపాయలను రైతు బజార్ల ద్వారా పంపిణీ చేస్తున్నామని పౌర సరఫరాలశాఖ అధికారులు వెల్లడించారు. బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలను అదుపులో ఉంచేలా నిరంతరం మిల్లర్లు, హోల్ సేల్ వ్యాపారస్తులతో మాట్లాడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన 204 వ్యాపారస్తులపై కేసులు నమోదు చేసినట్టు వివరించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్