- ఇది దేశంలోనే తొలి ఎఐ కుంభకోణమంటూ టివికె వ్యాఖ్య
- దర్యాప్తునకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
చెన్నై : గత డిఎంకె ప్రభుత్వ హయాంలో ఎఐ పుస్తకాల కుంభకోణం జరిగిందంటూ తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇది దేశంలోనే మొట్టమొదటి ఎఐ కుంభకోణమని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ గ్రంథాలయాల కోసం ఎఐతో రూపొందించిన పుస్తకాలను కొనుగోలు చేశారని, వాటిల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని తమిళనాడు పాఠశాల విద్యా శాఖ మంత్రి ఎ.రాజ్‌మోహన్ విమర్శించారు. దీనిపై తమ విభాగం అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేసిందని చెప్పారు. ఈ పుస్తకాల కొనుగోళ్ళపై దర్యాప్తు చేయడానికి, జరిగిన నష్టాలను భర్తీ చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.
కోయంబత్తూరులో ఇటీవల విజయ్ ప్రభుత్వం ప్రారంభించిన ‘పెరియార్ అరివులగం’ గ్రంథాలయంలోని పుస్తకాల విషయంలో వివాదం తలెత్తింది. డిఎంకె హయాంలో మొదలైన ఈ గ్రంథాలయం పనులు ఇటీవల పూర్తవడంతో ఈ నెల 16న ముఖ్యమంత్రి విజయ్ ప్రారంభించారు. ఆ గ్రంథాలయంలోని కొన్ని పుస్తకాల్లో చాలా మౌలికమైన, అలాగే చారిత్రకమైన అంశాల్లోనే తప్పులు కనిపిస్తున్నాయని నవలా రచయిత పెరుమాళ్ మురుగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పుస్తకాల రచయితలను, ప్రచురణకర్తల పేర్లను చూస్తుంటే ఇప్పటివరకు విని వున్నట్లు కూడా లేదని అన్నారు. ఇవన్నీ ఎఐతో రూపొందించిన పుస్తకాలన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కాగా అటువంటి వాటిల్లో ఒక ప్రచురణ సంస్థ నుండి వచ్చిన పుస్తకాలు చెన్నై, మదురై, తిరుచి, సేలం, కడలూర్, తిరునల్వేలి లైబ్రరీలకు సరఫరా అయ్యాయని మంత్రి పేర్కొన్నారు.
కాగా ఈ ఆరోపణలను డిఎంకె తోసిపుచ్చుతోంది. పారదర్శకమైన విధానాన్నే అనుసరించామని, పుస్తకాల ఎంపికకకు ఏర్పాటు చేసిన కమిటీలో పెరుమాళ్ మురుగన్ కూడా సభ్యులేనని తెలిపింది. ఇలా పాలక టివికె, ప్రతిపక్ష డిఎంకె ఎవరికి వారు ఆరోపణలు చేడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇరు పక్షాలు న్యాయపరమైన చర్యలకు డిమాండ్ చేస్తున్నాయి.







కామెంట్‌లు (0)