శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏజెన్సీలో ఎర్రజెండా రెపరెపలు

31 నిమిషాల క్రితం

ఏజెన్సీలో ఎర్రజెండా రెపరెపలు 
- ముంచింగిపుట్టులో సిపిఎం జెడ్‌‌పిటిసి అభ్యర్థి కొర్రా త్రినాధ్‌ ఘన విజయం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026, 12:20 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ముంచింగిపుట్టులో సిపిఎం జెడ్‌‌పిటిసి అభ్యర్థి కొర్రా త్రినాధ్‌ ఘన విజయం

ప్రజాశక్తి - విలేకరుల యంత్రాంగం : మన్య ప్రాంతాలైన అల్లూరి, పోలవరం జిల్లాల్లో ఎర్రజెండా రెపరెపలాడింది. శనివారం విడుదలైన పరిషత్‌ ‌ఫలితాల్లో ఒక జెడ్‌‌పిటిసి స్థానంతో పాటు పలు ఎంపిటిసి స్థానాల్లో విజయఢంకా మోగించింది. ఆదివాసీల సమస్యలపై నిరంతరం ఉద్యమిస్తున్న సిపిఎం ఇక్కడి ప్రజల గుండె చప్పుడుగా ఉంది. ఈ ఎన్నికల్లో గెలిచిన వారంతా పోరాట ధీరులు. ఉద్యమ గళాలు. తీవ్ర నిర్బంధాన్ని ఎదురొడ్డి నిలిచారు. బాక్సైట్‌ ‌తవ్వకాలు, హైడ్రో పవర్‌ ‌ప్రాజెక్టులకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం వారంతా ఉద్యమించారు. జిఒ 3 పునరుద్ధరణ కోసం పోరాటాలు సలిపారు. పోలవరం నిర్వాసితుల పక్షాన పోరాడారు. ఆదివాసీ చట్టాల పరిరక్షణకు ముందు పీఠిన నిలిచారు. వారిని నేడు ఆయా ప్రాంతాల్లో ప్రజలు గెలిపించారు.

​ముంచింగిపుట్టు జెడ్‌‌పిటిసిగా కొర్రా త్రినాధ్‌

అల్లూరి జిల్లా ముంచింగిపుట్టు మండలం నుంచి జెడ్‌‌పిటిసిగా సిపిఎం నాయకులు కొర్రా త్రినాధ్‌ ‌ఘన విజయం సాధించారు. ఆయనకు 10,161 ఓట్లు రాగా వైసిపి అభ్యర్థి, ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్‌‌పర్సన్‌ ‌జల్లిపల్లి సుభద్రకు 6735 ఓట్లు దక్కాయి. దీంతో త్రినాధ్‌ 3426 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. త్రినాధ్‌ ‌విజయంతో మండలంలో సంబరాలు మిన్నంటాయి. విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం, జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స, నాయకులు ఆర్‌.శంకరరావు తదితరులు పాల్గొన్నారు. నాలుగు రోడ్ల కూడలి వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా త్రినాధ్‌ ‌మాట్లాడుతూ.... తాను ఎస్‌ఎఫ్‌ఐ, ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యాన చేసిన పోరాటాలను, సాధించిన విజయాలను గుర్తుచేసుకున్నారు. ఉద్యమ స్ఫూర్తితో రానున్న కాలంలోనూ ఆదివాసీల, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తనకు ఓటు వేసి గెలిపించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎంఎం.శ్రీను, నారాయణ, జనాబందు, సీతారాం, లైకోన్, రామదాసు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్