శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Results: పరిషత్‌‌లూ కూటమికే...!

16 నిమిషాల క్రితం

wedi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026, 12:35 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- పలుచోట్ల ఉద్రిక్తతలు

- అధికార బలం చూపిన చోట్ల భారీ మెజార్టీలు

పరిషత్‌ ఎన్నికల్లోనూ టిడిపి కూటమి రాష్ట్రంలో ఆధిక్యం సాధించింది. జెడ్‌‌పిటిసిలతో పాటు, ఎంపిటిసి స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలుపొందారు. మున్సిపల్‌ కౌంటింగ్‌ మాదిరే, పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్ జరిగిన శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షాలకు చెందిన కౌంటింగ్‌ ఏజెంట్లను అడ్డుకోవడం, వారిపై దాడులు చేయడం వంటి సంఘటనలు పలుచోట్ల చోసుకున్నాయి. రాత్రి పదకొండు గంటల సమయానికి మొత్తం 659 జెడ్‌‌పిటిసి స్థానాల్లో 485 (టిడిపి 396, జనసేన 68, బిజెపి 21) చోట్ల కూటమి అభ్యర్థులు మరో 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. వైసిపి 55 స్థానాల్లో గెలుపొందింది. 6చోట్ల ఆధిక్యంలో ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు జడ్‌‌పిటిసి స్థానంలో సిపిఎం గెలుపొందింది. మరో రెండు స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు. నామినేషన్ల ప్రకియ నుండి అధికారాన్ని దుర్వినియోగం చేసి, ప్రతిపక్ష అభ్యర్థులపై దాడులు, బెదిరింపులు, పోలింగ్‌ ‌రోజున రిగ్గింగ్‌‌కు దిగిన చోట్ల కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీలను సాధించారు. పల్నాడు జిల్లా నకిరికల్లులో టిడిపి అభ్యర్థికి 32,919 ఓట్ల మెజార్టీ లభించింది. ఈ జిల్లాలోనే క్రోసూరు జడ్‌‌పిటిసి స్థానంలో జనసేన అభ్యర్థి 30 వేలకు పైగా మెజార్టీ సాధించారు. ఇక్కడ మొత్తం పోల్‌ అయిన ఓట్లు 38 వేలు కావడం గమనార్హం. నంద్యాల జిల్లా డోన్‌‌లో టిడిపి అభ్యర్థి 23,169 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత సొంత నియోజకవర్గమైన పులివెందులలో రెండు జెడ్‌‌పిటిసి స్థానాల్లో టిడిపి, రెండింటిలో వైసిపి గెలుపొందింది. పులివెందుల స్థానాన్ని తెలుగుదేశం పార్టీ 1,463 ఓట్ల మెజార్టీతో కైవసం చేసుకోగా, వేంపల్లెలో వైసిపి అభ్యర్థి 19,192 ఓట్ల ఆధిక్యతను సాధించడం విశేషం

ఎంపిటిసిల్లో...

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,818 ఎంపిటిసిలకు గాను కూటమి అభ్యర్థులు 7188 (టిడిపి 6,167, జనసేన 862,బిజెపి 159) స్థానాల్లో గెలుపొందారు. వైసిపి అభ్యర్థులు 1,589 చోట్ల విజయం సాధించారు. సిపిఎం 15 స్థానాలో గెలుపొందింది. సిపిఐ ఆరు చోట్ల విజయం సాధించింది.

saasvoting


table

ఈ ఫలితాలు సుపరిపాలనకు నిదర్శనం : మంత్రి లోకేష్‌

రాష్ట్ర వ్యాప్తంగా జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో కూటమి సాధించిన విజయం ప్రభుత్వ సుపరిపాలనకు నిదర్శనమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. ఈ విజయం కూటమి పార్టీల మధ్య సమన్వయం, సమిష్టి కృషికి ప్రతిఫలమని శనివారం ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. ఘన విజయానికి కారణమైన ప్రజలకు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికే మద్దతు పలుకుతున్నారని పేర్కొన్నారు. ఓటమి లేని కూటమి జైత్రయాత్ర కొనసాగుతోందని, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని, అప్పగించిన బాధ్యతను గుర్తించి గెలుపు అహంకారానికి తావులేకుండా ప్రజాసేవకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. రాగద్వేషాలకు అతీతంగా, ఎలాంటి వివక్ష లేకుండా నిస్వార్థంగా సుపరిపాలన అందిద్దామన్నారు.

మేం ఓడినా.. ప్రజల మనసులు గెలిచాం : వైఎస్‌ జగన్‌

స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్‌లో అధికారులపై ఒత్తిడి తెచ్చి ఫలితాలను తారుమారు చేశారని వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ తరహాలోనే జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల ఫలితాల్లోనూ పలు జిల్లాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని శనివారం ఎక్స్‌ వేదికగా విమర్శించారు. చంద్రబాబు ఎన్నికల్లో గెలిచినా నైతికంగా ఓడిపోయారని, తాము ఓడిపోయినా ప్రజల మనసులు గెలుచుకున్నామని పేర్కొన్నారు. నామినేషన్ల దశ నుంచి పోలింగ్‌, కౌంటింగ్‌ వరకు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. అధికార బలంతో ఎన్నికల్లో గెలవచ్చేమో కానీ ప్రజల విశ్వాసాన్ని గెలవలేరని, ప్రజాస్వామ్యాన్ని అణచివేయవచ్చేమో కానీ ప్రజల ఆకాంక్షలను అణచివేయలేరని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులెదురైనా, దాడులు జరిగినా, నిర్బంధాలు విధించినా వెనుకడుగు వేయకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా మహిళలకు అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో తమ పోరాటాలు మరింత దృఢంగా కొనసాగుతాయని, ప్రజల ఆశీస్సులతో నమ్మకం, విశ్వాసంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

ప్రజల నమ్మకానికి నిదర్శనం

- ఎన్నికల ఫలితాలపై టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా

పట్టణాల నుంచి పల్లెటూర్ల వరకు కూటమి ప్రభుత్వ పాలనకు ప్రజలు పట్టాభిషేకం చేయడం ఎంతో ఆనందంగా ఉందని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఇది కేవలం ఒక సాధారణ ఎన్నికల విజయం కాదని ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకానికి, సంక్షేమానికి, అభివృద్ధికి, సామాజిక న్యాయానికి నిదర్శమని పేర్కొన్నారు. టిడిపి కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. తప్పుడు ఆరోపణలు చేసినా, విధ్వంసకర పరిస్థితులు సృష్టించినా ప్రజలు వాటన్నింటినీ తిప్పికొట్టి వైసిపిని పూర్తిగా పక్కనబెట్టారన్నారు. ​వైసిపి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చాలా అమాయకుడని, అన్యాయంగా అరెస్టు చేశారని ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మాట్లాడుతుండటం హాస్యాస్పదమని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. అప్పిరెడ్డి రౌడీషీటర్ అని విమర్శించారు.

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్