గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'ఉత్తరాంధ్ర' వైపు దూసుకొస్తున్న ‘అక్వాన్’ తుపాన్

45 నిమిషాల క్రితం

sea
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 08:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- మరో 24-36 గంటలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘అక్వాన్’ తుపాన్ ఉత్తరాంధ్ర తీరంవైపు దూసుకొస్తోంది. తుపాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో రానున్న 24 నుంచి 36 గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలోని సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు ప్రకటన విడుదల చేశారు. ఉదయం 5.30 గంటల సమయానికి విశాఖపట్నానికి 460 కిలోమీటర్లు, కాకినాడకు 490 కిలోమీటర్ల దూరంలో తుపాన్ కేంద్రీకృతమై ఉంది. గత ఆరు గంటల్లో గంటకు సుమారు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదిలినట్లు అధికారులు వెల్లడించారు. నవంబర్ 20వ తేదీ తెల్లవారుజామున శ్రీకాకుళానికి ఉత్తరంగా తుపాన్ తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయానికి తుపాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా లేదా తుపాన్‌గా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది.

తుపాన్ ప్రభావంతో నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే సూచనలున్నాయి. రేపు ఉత్తరాంధ్రలో విస్తారంగా తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాన్ తీరం దాటిన అనంతరం వర్షాల తీవ్రత క్రమంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడతో పాటు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. మధ్యాంధ్ర, దక్షిణాంధ్ర ప్రాంతాల్లో ఈ తుపాన్ ప్రభావం గణనీయంగా ఉండకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

మత్స్యకారులు తదుపరి అధికారిక ప్రకటన వచ్చే వరకు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. తీరప్రాంత, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. చెరువులు, జలాశయాలు, లోతట్టు ప్రాంతాలు, తీరప్రాంతాలపై జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోంది.

తుపాన్ పరిస్థితులను రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని, అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్