- వాయు కాలుష్యంపై ప్రభుత్వం రూ.5.42 కోట్లు వసూలు
న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలు, పారిశ్రామిక సంస్థలపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. నవంబర్ మొదటి 17 రోజుల్లో చెల్లుబాటు అయ్యే కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రం (PUC) లేని 25,610 వాహనాలకు జరిమానాలు విధించారు. బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా లేని మరో 30,742 వాహనాలను నగర పరిధి నుంచి వెనక్కి పంపించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాల నుంచి మొత్తం రూ.5.42 కోట్ల జరిమానా వసూలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేఖా గుప్తా అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులు ఈ వివరాలను వెల్లడించారు. నవంబర్ 1 నుంచి 17వ తేదీ వరకు సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలను మినహాయించి బీఎస్-6 ప్రమాణాల కంటే తక్కువ స్థాయిలో ఉన్న 1,81,548 ప్రభుత్వేతర వాహనాలను తనిఖీ చేశారు. వీటిలో 30,742 వాహనాలను వెనక్కి పంపగా, 2,817 వాహనాలకు చలాన్లు విధించారు. మరో 189 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
కాలుష్య నియంత్రణలో భాగంగా ఆమోదిత పారిశ్రామిక జోన్లలో పనిచేస్తున్న 709 అక్రమ, కాలుష్య కారక పరిశ్రమలను మూసివేశారు. అనధికార ప్రాంతాల్లోని 11,415 యూనిట్లపై నిర్వహించిన సర్వేలో 1,762 యూనిట్లు వాయు కాలుష్యానికి, 684 యూనిట్లు జల కాలుష్యానికి కారణమవుతున్నట్లు గుర్తించారు. దీంతో మొత్తం 2,446 యూనిట్లను మూసివేయడం లేదా సీల్ చేయడం జరిగింది.
నిర్మాణ, కూల్చివేత పనుల వల్ల వెలువడుతున్న దుమ్మును నియంత్రించేందుకు కూడా చర్యలు చేపట్టారు. నవంబర్ 1 నుంచి 17 వరకు 8,874 నిర్మాణ ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించగా, 554 చోట్ల నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు. 112 ప్రదేశాలను మూసివేయాలని ఆదేశించగా, 462 ప్రదేశాలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పర్యావరణ నష్టపరిహారం కింద రూ.2.65 కోట్ల జరిమానా విధించారు. నిర్మాణ ప్రాంతాల్లో దుమ్ము వ్యాప్తిని అరికట్టేందుకు గ్రీన్ నెట్స్, బారికేడ్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
మరోవైపు రోడ్లను శుభ్రం చేసేందుకు త్వరలో 70 కొత్త యంత్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. గత ఏడాదితో పోలిస్తే యాంటీ స్మాగ్ గన్ల సంఖ్యను 376 నుంచి 437కి, వాటర్ స్ప్రింక్లర్ల సంఖ్యను 271 నుంచి 296కి పెంచారు. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పొగ నియంత్రణ గన్లు, నీటిని పిచికారీ చేసే వ్యవస్థలు నిరంతరం పనిచేసేలా చూడాలని ఢిల్లీ మెట్రో అధికారులను ఆదేశించారు. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.







కామెంట్లు (0)