గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పనిచేయని యాంటీబయాటిక్స్ మందులు

34 నిమిషాల క్రితం

anti
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 07:09 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

- నవజాత శిశువులకు, ఐసియు రోగులకు పెను ముప్పు

- ఐసిఎంఆర్ నివేదిక వెల్లడి

​న్యూఢిల్లీ: ఇన్ఫెక్షన్లను నియంత్రిచడంలో, శస్త్రచికిత్సలను సురక్షితంగా పూర్తి చేయడంలో, నెలలు నిండని శిశువులు, తీవ్ర అనారోగ్య రోగుల ప్రాణాలు కాపాడటంలో కీలకమైన యాంటీబయాటిక్స్ ఇప్పుడు ముప్పులో పడ్డాయి. వైద్యులు ఏళ్లుగా వాడుతున్న మందులకు అనేక సాధారణ బ్యాక్టీరియా లొంగడం లేదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) తాజా నివేదిక స్పష్టం చేసింది. ఐసిఎంఆర్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ సర్వైలెన్స్ అండ్ రీసెర్చ్ నెట్‌వర్క్ (ఎఎంఆర్ఎస్ఎన్) వార్షిక నివేదిక 2025 దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లోని బ్యాక్టీరియాపై వివిధ యాంటీబయాటిక్స్ ఎంతవరకు పనిచేస్తున్నాయో వివరించింది. సాధారణ ఇన్ఫెక్షన్లపై కూడా మందుల ప్రభావం తగ్గుతోందని, తీవ్ర ఇన్ఫెక్షన్లకు వాడే బలమైన మందులను కూడా కొన్ని బ్యాక్టీరియా తట్టుకుంటున్నాయని నివేదిక చెబుతోంది. ఇ-కోలై బ్యాక్టీరియా పెద్ద ఆందోళనగా మారిందని, యాంటీమైక్రోబియల్ నిరోధకత (ఎఎంఆర్) ఇప్పుడు చిన్న ఆసుపత్రులకూ విస్తరించిందని, దీన్ని ఎదుర్కోవడంలో చికిత్సతో పాటు నివారణకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని నివేదిక స్పష్టం చేసింది. 2025లో దేశంలోని 30 పెద్ద, ప్రత్యేక ఆసుపత్రుల నుంచి 1,13,008 ప్రయోగశాల నమూనాలను ఐసిఎంఆర్‌ విశ్లేషించింది. తొలిసారిగా 34 చిన్న (సెకండరీ కేర్) ఆసుపత్రుల డేటానూ చేర్చింది.

​ఇ-కోలైపై మందులు విఫలం

ఇ-కోలై సాధారణంగా పేగుల్లో ఉండే బ్యాక్టీరియా. కొన్ని రకాలు మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, రక్తం, పేగులకు తీవ్ర ఇన్ఫెక్షన్లు కలిగిస్తాయి. క్లెబ్సియెల్లా న్యుమోనియా బ్యాక్టీరియా, మూత్రనాళ, రక్త, గాయాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. సూడోమోనాస్ న్యుమోనియా బ్యాక్టీరియా, రక్త, మూత్రనాళ ఇన్ఫెక్షన్లతో పాటు గాయాలు, కాలిన గాయాల్లో ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అసినెటోబాక్టర్ బౌమానీ బ్యాక్టీరియా తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగుల్లో ప్రమాదకర ఇన్ఫెక్షన్లు కలిగిస్తుంది. ఇ-కోలై విషయంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. పరీక్షించిన నమూనాల్లో 18.4 శాతం మాత్రమే సెఫోటాక్సిమ్‌కు, 24.7 శాతం సెఫ్టాజిడిమ్‌కు స్పందించాయి. సిప్రోఫ్లాక్సాసిన్‌కు స్పందించినవి కేవలం 9 శాతం. అంటే నివేదికలోని ఆసుపత్రుల్లో అనేక ఇ-కోలై ఇన్ఫెక్షన్లపై ఈ మందులు పనిచేయకపోవచ్చు అని ఐసిఎంఆర్‌ ‌తెలిపింది. క్లెబ్సియెల్లా న్యుమోనియే బ్యాక్టీరియా కూడా ఇలాంటి సవాలే విసురుతోంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల (ఐసియు) నుంచి సేకరించిన నమూనాల్లో మందుల ప్రభావం మరింత తక్కువ. చికిత్స కష్టమవుతుందని, కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చని దీనర్థం.

ఆసుపత్రి ఇన్ఫెక్షన్లలో అత్యంత ఆందోళనకరమైన విషయం అసినెటోబాక్టర్ బౌమానీ గురించి. పరీక్షించిన నమూనాల్లో 91.1 శాతం కార్బపెనెమ్స్‌కు నిరోధకత చూపాయి. అంటే ఈ శక్తివంతమైన మందులు చాలా నమూనాలపై పనిచేసే అవకాశం లేదు. ముఖ్యంగా ఐసియుల్లో వైద్యుల వద్ద చికిత్స ఎంపికలు మరింత తగ్గుతాయి. చికిత్స కష్టమైన ఆసుపత్రి ఇన్ఫెక్షన్లు కలిగించే సూడోమోనాస్ ఎరుగినోసాపైనా వైద్యులు ఓ కన్నేసి ఉంచాలని నివేదిక సూచిస్తోంది. అందుకే ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ల నివారణ చికిత్సంత ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, పరికరాలు, ఉపరితలాల శుభ్రత, వైద్య పరికరాల స్టెరిలైజేషన్, ఇన్ఫెక్షన్లు వ్యాపించకుండా జాగ్రత్తలు పాటించాలని నివేదిక విశ్లేషించింది. అలాగే, వివిధ స్థాయిల ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో యాంటీబయాటిక్ నిరోధకత ఆందోళనకరంగానే ఉంది. అయితే బ్యాక్టీరియా రకాలు, నిరోధకత తీరు మారుతున్నాయి. చిన్న ఆసుపత్రుల్లో, ముఖ్యంగా మూత్ర నమూనాల్లో ఇ-కోలై ఎక్కువగా కనిపించింది. పెద్ద ఆసుపత్రుల్లో క్లెబ్సియెల్లా, సూడోమోనాస్, అసినెటోబాక్టర్ సంఖ్య ఎక్కువగా ఉండి, వైవిధ్యమైన బ్యాక్టీరియా నమోదైంది. ఈ తేడాలకు చికిత్స పొందే రోగుల రకాలు, వ్యాధి తీవ్రత, ఆసుపత్రి వాతావరణానికి గురికావడం కారణం కావచ్చు. అందుకే ఒకే మందు అన్నిచోట్లా సమానంగా పనిచేస్తుందని భావించకుండా, తమ ప్రాంతంలోని నిరోధకత సమాచారాన్ని వైద్యులు తెలుసుకోవాలని నివేదిక సూచిస్తోంది.

యాంటీబయాటిక్ నిరోధకత ప్రతి బ్యాక్టీరియాపై, ప్రతి మందుపై ఒకేలా ఉండదని కూడా నివేదిక చెబుతోంది. కొన్ని మందులకు నిరోధకత పెరుగుతున్నా, మరికొన్నింటికి బ్యాక్టీరియా ఇంకా లొంగుతోంది. ఉదాహరణకు టైఫాయిడ్‌కు కారణమయ్యే సాల్మొనెల్లా టైఫీ, అజిత్రోమైసిన్, సెఫ్ట్రియాక్సోన్ సహా పలు మందులకు బాగా స్పందించింది. అయితే సిప్రోఫ్లాక్సాసిన్‌కు స్పందన చాలా తక్కువ. గతంలో బాగా పనిచేసిన మందు ఇప్పుడూ పనిచేస్తుందని వైద్యులు భావించలేరని, ఇన్ఫెక్షన్‌కు కారణమైన బ్యాక్టీరియా, దానికి ఇంకా లొంగే మందులను బట్టే సరైన చికిత్స ఎంచుకోవాలని దీని అర్థం. అలాగే, విరేచనాలకు కారణమయ్యే బ్యాక్టీరియాపై ఫలితాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. పరీక్షించిన షిగెల్లా ఫ్లెక్స్‌నెరీ నమూనాల్లో కేవలం 7.5 శాతం, షిగెల్లా సోనీ నమూనాల్లో 8.9 శాతం సిప్రోఫ్లాక్సాసిన్‌కు స్పందించాయి. డయేరియా కలిగించే ఇ-కోలై రకాల్లో 0.7 శాతం మాత్రమే సిప్రోఫ్లాక్సాసిన్‌కు, 4.6 శాతం మాత్రమే సెఫిక్సిమ్‌కు స్పందించాయి.

అందువల్ల కొన్ని బ్యాక్టీరియా డయేరియా ఇన్ఫెక్షన్లకు స్థానిక నిరోధకత తీరును పట్టించుకోకుండా ఫ్లోరోక్వినోలోన్స్ అనే యాంటీబయాటిక్స్‌‌ను వైద్యుల పర్వవేక్షన లేకుండా వాడకూడదని నివేదిక హెచ్చరిస్తోంది.

​నవజాత శిశువులు, రోగులకు అధిక ముప్పు

ఇన్ఫెక్షన్లకు ఎక్కువ లోనయ్యే నవజాత శిశువులు, తీవ్ర అనారోగ్య రోగులపై యాంటీబయాటిక్ నిరోధకత ప్రభావం మరింత ఆందోళనకరం. తొలిసారిగా నవజాత శిశువులు, చిన్నారులు, పిల్లల్లో రక్త ఇన్ఫెక్షన్లపై నివేదిక ప్రత్యేక ఫలితాలు అందించింది. 0–28 రోజుల వయసు నవజాత శిశువుల్లో క్లెబ్సియెల్లా న్యుమోనియే అత్యధికంగా 25.1 శాతం నమూనాల్లో కనిపించింది. కాండిడా అనే శిలీంధ్రం, అసినెటోబాక్టర్ బౌమానీ కూడా తరచుగా గుర్తించారు. శిశువుల్లో ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్న అనేక ముఖ్య బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు సెఫలోస్పోరిన్స్ వంటి యాంటీబయాటిక్స్‌కు సరిగా స్పందించడం లేదని నివేదిక పేర్కొంది. రక్తం ద్వారా వ్యాపించే తీవ్ర ఇన్ఫెక్షన్ అయిన సెప్సిస్ నవజాత శిశువుకు చికిత్స చేయడానికి అత్యంత కీలకం. కానీ ఇన్ఫెక్షన్ కారక బ్యాక్టీరియా సాధారణ మందులకు నిరోధకత చూపితే వైద్యుల పని కష్టమవుతుంది. అందువల్ల శిశు సంరక్షణలో సకాలంలో రోగ నిర్ధారణ, నమ్మకమైన ప్రయోగశాల పరీక్షలు, కఠిన ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యలు ప్రత్యేకంగా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడొద్దు..

యాంటీబయాటిక్స్ వాడకంలో మరింత జాగ్రత్త, బాధ్యత అవసరమని నివేదిక ఉద్ఘాటించింది. ఇన్ఫెక్షన్‌కు కారణమైన బ్యాక్టీరియాను గుర్తించి, ఏ యాంటీబయాటిక్స్ పనిచేస్తాయో చూపే ప్రయోగశాల పరీక్షలు వైద్యులకు సకాలంలో అందుబాటులో ఉండాలి. ఆ ఫలితాల ఆధారంగా అవసరమైనప్పుడు చికిత్సను మార్చాలి. యాంటీబయాటిక్స్‌ను బాధ్యతాయుతంగా వాడటం ఆసుపత్రుల్లో రోగ సంరక్షణలో సాధారణ భాగం కావాలి. కొన్ని తీవ్ర ఇన్ఫెక్షన్లకు మిగిలిన కొద్ది ఎంపికల్లో కార్బపెనెమ్స్ వంటి మందులు ఉండవచ్చు కాబట్టి, వాటిని ప్రత్యేకంగా కాపాడుకోవాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్