- ఘోర రోడ్డు ప్రమాదం... 30 నుంచి 40 మందికి గాయాలు
ప్రజాశక్తి - అనంతపురం: జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాప్తాడు మండలం రామినేపల్లి సమీపంలో ఎఫ్‌ఆర్‌కే ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బోల్తాపడింది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 నుంచి 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో 30 నుంచి 40 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఎవరికీ ప్రాణాపాయం లేదని ప్రాథమిక సమాచారం. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే బస్సు అదుపుతప్పి బోల్తాపడినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారైనట్లు సమాచారం.
సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి, వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు.







కామెంట్‌లు (0)