- రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సిపిఎం డిమాండ్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అధికారపక్షం అడ్డుకొని దాడులు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు శనివారంఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతిపక్షాలను, వామపక్షాల అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా ఒక పథకం ప్రకారం చేస్తున్న ఘర్షణలను అడ్డుకోవడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ విఫలమైందని ఆయన పేర్కొన్నారు. ఏ రాజకీయ పార్టీకి చెందినవారైనా స్వేచ్ఛగా తమ నామినేషను దాఖలు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనల్లో బయటి రాష్ట్రాలకు చెందిన కిరాయి గూండాలతో దాడులు చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలు ఆందోళనకరమన్నారు. కడప జిల్లా బద్వేలులో సిపిఎం అభ్యర్థి మోక్షమ్మ వామపక్ష పార్టీల నాయకులతో కలిసి నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు కొంతమంది దుండగులు నామినేషన్ పత్రాలు చించివేసి వామపక్ష నాయకులపై దాడిచేశారని, గుత్తిలో సిపిఎం అభ్యర్థి నామినేషన్ వేయకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించారని, కడపలో సిపిఐ అభ్యర్థి బాదుల్లా నామినేషన్ పత్రాన్ని చించివేశారని తెలిపారు. ఇంత జరుగుతున్నా పోలీసులు జోక్యం చేసుకోకపోవడం అన్యాయమన్నారు. అనేకచోట్ల పోలీసులు అధికారపక్షం కొమ్ముకాశారన్నారు. నామినేషన్లు వేయకుండా ఘర్షణలు జరిగిన అంశాలు పత్రికలలో వచ్చాయని పేర్కొన్నారు. రాయచోటి, పుంగనూరు, ధర్మవరం, కడప, తిరుపతిలో జరిగిన ఘర్షణల్లో పోలీసులు చోద్యం చూశారని విమర్శించారు. శనివారం పులివెందులలో పోలీసులు కాల్పులు జరిపిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముందుగా తగు జాగ్రత్త చర్యలు తీసుకోక పోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ డమ్మీగా మారకుండా స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఘర్షణలకు తావులేకుండా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. నామినేషన్ దాఖలు చేసే కార్యాలయాల పరిసరాల్లో , కాంపౌండ్లలో సిసి కెమెరాలు పెట్టాలని, అవసరమైనచోట ఆన్లైన్ ద్వారా నామినేషన్లు తీసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరారు.








కామెంట్లు (0)