గుర్నూర్‌కు నాలుగు, ఆకిబ్, కంబోజ్‌కు రెండేసి వికెట్లు
డక్‌వర్త్‌లో కివీస్‌పై టీమిండియా గెలుపు
వర్షంతో మ్యాచ్‌కు పలుమార్లు అడ్డంకి
వెల్లింగ్టన్: వర్షం.. వికెట్ల పతనం.. ఉత్కంఠ.. చివరకు డక్‌వర్త్ లూయిస్(డిఎల్‌ఎస్) పద్ధతిలో భారత్ గెలిచింది. హెన్రీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా 4 పరుగుల తేడాతో గెలిచి ఐదు వన్డేల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత భారత పేసర్లు గుర్నూర్ బ్రార్ నాలుగు వికెట్లకు తోడు ఆకిబ్ నబీ, కంబోజ్ చెలరేగడంతో న్యూజిలాండ్ 41 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో భారత బ్యాటర్లు తడబడినా.. చివర్లో వర్షం రావడంతో డీఎల్‌ఎస్ పద్ధతి విజయాన్ని అందుకుంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ను భారత పేసర్లు ఆరంభంలోనే దెబ్బతీశారు. అఖిబ్ నబీ రెండు వికెట్లు తీసి కివీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. అనంతరం అన్షుల్ కంబోజ్ మరో రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను మరింత కష్టాల్లోకి నెట్టాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా సీనియర్ బ్యాటర్ డారిల్ మిచెల్ పట్టుదలగా క్రీజ్‌లో కుదురుకొని 104 బంతుల్లో 55 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరుకు దోహదపడ్డాడు. గ్లెన్ ఫిలిప్స్(0), టామ్ లాథమ్(7) స్వల్ప స్కోర్లకే పెవీలియన్‌కు చేరగా.. కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 31 పరుగులతో రాణించాడు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 41 ఓవర్లలో 134 పరుగులకు కుప్పకూలింది. భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ చివర్లో రెండేసి వికెట్లు తీశాడు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గోల్డెన్ డక్‌గా వెనుదిరగగా.. విరాట్ కోహ్లీ 7 పరుగులకే ఔటయ్యాడు. రోహిత్ శర్మ(23), శ్రేయస్ అయ్యర్(30) పరుగులు చేసి ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో భారత్ కష్టాల్లో పడింది. కేఎల్ రాహుల్ 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 26 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులతో ఉన్న దశలో భారీ వర్షంతో మ్యాచ్ నిలిచింది. ఎంతసేపటికీ వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో డక్‌వర్త్ లెక్కల ప్రకారం భారత్ 4 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గుర్నూర్ బ్రార్‌కు లభించగా.. మూడో వన్డే హామిల్టన్ వేదికగా మంగళవారం జరగనుంది.
స్కోర్‌బోర్డు...
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: యంగ్ (సి)కెఎల్ రాహుల్ (బి)ఆకిబ్ నబీ 6, షెఫర్ట్ (సి)కంబోజ్ (బి)ఆకిబ్ నబీ 0, నికోల్స్ (బి)కంబోజ్ 11, మిఛెల్ (సి)కంబోజ్ (బి)అక్షర్ పటేల్ 55, లాథమ్ (సి)నమన్ ధీర్ (బి)గుర్నూర్ బ్రార్ 7, ఫిలిప్స్ (సి)కంబోజ్ (బి)గుర్నూర్ బ్రార్ 0, సాంట్నర్ (సి)కెఎల్ రాహుల్ (బి)గుర్నూర్ బ్రార్ 31, స్మిత్ (సి)రోహిత్ శర్మ (బి)గుర్నూర్ బ్రార్ 3, జేమీస్ (బి)అక్షర్ పటేల్ 7, టిక్నెర్ (బి)కంబోజ్ 2, డఫీ (నాటౌట్) 1, అదనం 11. (41 ఓవర్లలో ఆలౌట్) 134 పరుగులు. వికెట్ల పతనం: 1/0, 2/11, 3/23, 4/53, 5/53, 6/112, 7/119, 8/127, 9/132, 10/134. బౌలింగ్: ఆర్ష్‌దీప్ 7-1-16-0, ఆకిబ్ 7-0-31-2, కంబోజ్ 8-0-25-2, గుర్నూర్ 10-2-30-4, అక్షర్ 9-1-28-2.
ఇండియా ఇన్నింగ్స్: రోహిత్ (సి)నికోల్స్ (బి)జేమీసన్ 23, గిల్ (సి)నికోల్స్ (బి)డఫీ 0, కోహ్లి (సి)యంగ్ (బి)డఫీ 7, శ్రేయస్ (సి)లాథమ్ (బి)జేమీసన్ 30, అక్షర్ (సి)డఫీ (బి)ఫిషెర్ 7, కెఎల్ రాహుల్ (నాటౌట్) 26, నమన్ ధీర్ (సి)టిమ్ షెఫర్ట్ (బి)డఫీ 12, కంబోజ్ (సి)డఫీ (బి)జేమీసన్ 1, ఆకిబ్ నబీ (నాటౌట్) 1, అదనం 6. (26ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 113 పరుగులు. వికెట్ల పతనం: 1/4, 2/17, 3/39, 4/47, 5/86, 6/108, 7/111 బౌలింగ్: జేమీసన్ 10-1-35-3, డఫీ 7-1-35-3, స్మిత్ 5-1-19-0, ఫిషెర్ 4-0-23-1.







కామెంట్‌లు (0)