- మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
ప్రజాశక్తి- శ్రీకాకుళం సిటీ : స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, అక్రమాలు, హింసకు పాల్పడి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మాజీ మంత్రి, వైసిపి సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ప్రజల తీర్పును స్వేచ్ఛగా ఎదుర్కొనే ధైర్యంలేకే అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా వైసిపి కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర అపఖ్యాతిని తెచ్చిందన్నారు. ఓటర్ల జాబితా తయారీ నుంచి డివిజన్ల విభజన, రిజర్వేషన్ల కేటాయింపు, నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ వరకు అడుగడుగునా అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల ఓట్లు వేర్వేరు డివిజన్లలో ఉండేలా ఓటర్ల జాబితాను అస్తవ్యస్తం చేశారని, అధికార పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా డివిజన్ల విభజన, రిజర్వేషన్ల కేటాయింపులు జరిగాయని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన బలమైన అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా బెదిరింపులకు దిగారని, వారి వృత్తి, వ్యాపారాలకు ఆటంకాలు కలిగిస్తూ భయభ్రాంతులకు గురిచేశారని పేర్కొన్నారు. ధైర్యంగా నామినేషన్లు వేసిన వారిపై దాడులు చేసి గాయపరిచారని, కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థుల అనుమతి లేకుండానే నామినేషన్ల ఉపసంహరణలు చేశారని విమర్శించారు. పోలింగ్ రోజున ఎన్నికల ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్లలో ఉంచడం ద్వారా అధికార పార్టీకి దొంగ ఓట్లు వేసుకునే అవకాశం కల్పించారని ఆరోపించారు.







కామెంట్లు (0)