ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ధూపం

20 నిమిషాల క్రితం

A Grieving Widow’s Farewell.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 11:15 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

‘మంజు ఎంత అదృష్టవంతురాలో, వాళ్ళాయన చివరి శ్వాస ఆమె చేతుల్లోనే తీసుకున్నాడు’ అని అందరూ అంటున్నారు. ‘అయినా ఇందులో అదృష్టం ఏముంది? ఆ క్షణాన్ని నేను ఎంత భారంగా మోసానో వాళ్లకెలా తెలుస్తుంది? ఆయన ఊపిరి ఆగిపోయేటప్పుడు, ఆఖరిసారిగా గాలి పీల్చుకుంటున్నప్పుడు ఒకటే ఎగశ్వాస. ఎక్కడెక్కడి కోపాలు, ఎప్పుడెప్పుడి ఆవేశాలు అందులో కలిశాయో..! లేదంటే ఇంకా చూపించవలసిన ఆవేశాలు మిగిలి ఉన్నాయో..? అదీ కాదంటే ఇక శ్వాస తీసుకోలేనని తనకు తెలుస్తున్న గుర్తులో! అంత వేగంగా, అంత గట్టిగా.. ఒకరకంగా చెప్పాలంటే, ఆయన చివరి ఊపిరి తీసుకునే విధానాన్ని చూసి నేను ఊపిరి తీసుకోవడమే మర్చిపోయాను. ఆ ఎగశ్వాసకు ముందు ఆయన పెదవులు కదిలాయి. ఏదో అనబోయాడు. కానీ ఒక్క అక్షరం కూడా బయటకు రాలేదు. నా పేరా, క్షమించమనా, నీళ్లు కావాలనా? పిల్లలు జాగ్రత్త అనా!? నన్ను జాగ్రత్తగా ఉండమనా!? నేనెప్పటికీ తెలుసుకోలేను. ఇక ఆ నిండా తెరుచుకున్న కళ్ళు.. తనను ఎవరైనా తరిమారా? గతంలో నాకూ ఆయనకు మధ్య జరిగిన గొడవలన్నీ గుర్తుకు వచ్చాయా? ఇంకేదైనా చెప్పేందుకు మిగిలి వుందా? నేను ఆయన్ని అనుసరించినవి, ఎదిరించినవి..? అన్నిటికీ నన్ను మళ్ళీ సమాధానం చెప్పమంటున్నాడా? అన్నీ ప్రశ్నలే ఆ కళ్లను చూస్తే. నిండుగా తెరుచుకున్న కళ్ళు.. అందులో ఏదో వేదం, ఏదో నిర్వేదం. బతికించమన్న వేడుకోలు, వెళ్ళిపోతున్నానే వీడుకోలు... అంతా కలగాపులగంగా ఆ కళ్లలో!

...

పెళ్లయిన కొత్తలో ఒకసారి పండక్కి అమ్మ దగ్గరికి వెళ్తానన్నాను. ఆయన ఏమీ అనలేదు. తింటున్న కంచాన్ని పక్కకు తోసి, లేచిపోయాడు. పదకొండు రోజులు నాతో మాటల్లేవు. ఆ తర్వాత ఎప్పుడూ నేనాయన్ని ఏమీ అడగలేదు. అడగాలనీ అనిపించలేదు. ఇన్నేళ్లుగా అదే పంతంతో ఎలా ఉన్నానో, ఎందుకు ఉన్నానో! ఆయనా ఆ విషయం ఎత్తలేదు. బహుశా ఒక్క దెబ్బతోనే అదుపులో పెట్టానని అనుకున్నాడో, నాకు పంతం ఎక్కువని అర్థం చేసుకున్నాడో.


...

ఇప్పుడు ఈ కళ్ళు మళ్ళీ ఆ కంచాన్నే తోసినట్టు చూస్తున్నాయా? ఇప్పుడూ అదే పంతంతో ఈ మిగిలిన జీవితాన్ని నేను గడిపేస్తానని ధీమాగా ఉన్నాయా!? గడిపేస్తాలే, తప్పదు. పెద్దోడూ, చిన్నోడూ, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు.. వీళ్లందరూ ఇద్దరం లేకుంటే కష్టం కదా! ఆయన తల నా తొడ మీద చాలా బరువుగా ఉన్నట్టుంది. బతికున్నప్పుడు ఆయన్ని మోయడం ఎరుగను, ఇప్పుడు మొత్తం బరువు నా మీదే వదిలేసినట్టు! కాళ్లు తిమ్మిరెక్కుతున్నాయి. కదిలిస్తే ఎవరన్నా చూసి ఏమనుకుంటారో.. భర్త ప్రాణం పోతుంటే కాళ్లు సర్దుకునే సమయమా ఇది అనుకుంటారేమో అనిపిస్తోంది. అలాగే కదలకుండా కూర్చుని ఉన్నాను. ఒళ్లు నెమ్మది నెమ్మదిగా చల్లబడుతూ, నా ఒంట్లో వేడిని కూడా తనతో లాక్కెళ్లిపోతోంది. అంత రక్తం ఏమవుతుందో తెలియడం లేదు.. గడ్డకట్టేస్తోంది, నరాలలో చలనం మాయమవుతోంది. అన్నీ నాకు స్పృహలోకి వస్తున్నాయి. నా శరీరానికి తగులుతున్న ఆయన ప్రతీ అణువు నాలో భయాన్ని, చెమటతో తడిసిపోయేంత అలజడిని, ఇంకా ఏదో తెలియని కంగారును కలిగిస్తోంది. చిన్నాడు నిన్ననే వచ్చాడు. ఎందుకో బాగా గుర్తుకు వచ్చామట. చూడబోతే వాడికి వాళ్ల నాన్న మీదున్న ప్రేమే లాక్కొచ్చినట్టుంది చివరి చూపుకు. రేపు నేను పోయేముందూ వాడికి తెలుస్తుందా, వాడు వస్తాడా? అసలు ఇకపై నేను ఇక్కడే ఉంటానా!? ఈ ఇంట్లో... అదే మా ఆయన కట్టించిన ఆయన ఇంట్లో... చిన్నగా ఆయన ఊపిరి ఆగడం అర్థమౌతోంది. బార్లా తెరుచుకున్న కళ్ళు, కళ్ల రెప్పలను దగ్గరికి తీసుకుంటున్నాయి. ఒళ్లు వేడి నుంచి చలిదనానికి మెల్లమెల్లగా జారుతోంది. ఏం చేయాలో తెలియక నా చేతులు ఆయన నుదుటి మీద వాలుతున్నాయి. ఏనాడూ ఆయన్ని ఇలా తాకలేదు. కళ్లు మూయాలా? మూస్తే ఆయన వెళ్ళిపోయినట్టు ఒప్పుకున్నట్టు కాదా? మూయకపోతే ఇలాగే చూస్తూ ఉంటాడా? చేయి వణుకుతోంది. ఒక్కసారి రెప్పల మీద వేలు పెట్టి తీసేస్తాను. ఆ నిర్ణయం కూడా నాది కాదనిపిస్తోంది. మంచం పక్కన టేబుల్ మీద ఆయన తాగని మజ్జిగ గ్లాసు ఉంది. పొద్దున్నే నేను కలిపి పెట్టింది. ఇదంతా నేను ఆయన్ని ఒళ్లో పడుకోబెట్టుకున్నందుకా? ఇన్నాళ్లు కాపురం చేసినందుకా? అన్యోన్య జంట అనే బిరుదు కోసం ఇద్దరం ఒకరిని ఒకరం మోసం చేసుకుంటూ మోసుకు తిరిగినందుకా? అసలు ఇద్దరం ప్రేమగానే సంసారాన్ని లాగామా? ఎగశ్వాస ఆగాక గదిలో ఏదీ వినిపించడం లేదు. అంతకుముందు వరకు గడియారం ఇంత గట్టిగా కొట్టుకుంటున్నట్టు తెలియదు. బయట ఎవరో గిన్నె కింద పడేశారు, ఆ చప్పుడు ఇక్కడికి వేరే లోకం నుంచి వచ్చినట్టుంది. నా గుండె చప్పుడు నాకే వినిపిస్తోంది.. ఆయనది లేదు. రెండు గుండెలు ఒకే గదిలో ఉండి, ఒక్కటే కొట్టుకోవడం అదే మొదటిసారి. ఇది ఆయన చివరి శ్వాస.. అయిపోయింది, వెళ్ళిపోయారు. మరి ఇప్పుడెందుకు ఈ ప్రశ్నలన్నీ? నా ఒళ్లో నుంచి ఆయన్ను పక్కకు తీసి పడుకోబెడుతున్నారు. ఎవరో అంటున్నారు, రుణం తీరిపోయిందని. ఇంకెవరో అంటున్నారు, అదృష్టవంతురాలు.. ఒడిలో ప్రాణం పోయిందని. ఇంతకీ... రుణం తీరిపోయిందా? నేను అదృష్టవంతురాలినా!?

...

ఎక్కడ పుట్టాను, ఏ గుమ్మం దాటి ఈ ఇంటికి వచ్చాను? తనైనా అంతేకదా..! వాళ్ల అమ్మ కొంగు వదిలి వచ్చాడు ఈ సంసార బంధంలోనికి. ఇద్దరం మార్పులకు సిద్ధపడ్డ వాళ్లమే. ఆయన ఏ రోజూ దేనికీ క్షమాపణ చెప్పలేదు, నేనూ ఏ రోజూ ఆశించలేదు. అవునా... ఆశించలేదా!? సంసారంలో ఇద్దరం పోరాడినట్టే ఉన్నాం. అనేకసార్లు "ఎందుకు ఇలా?" అనుకున్నాం, ఎన్నోసార్లు "తప్పదు, సర్దుకుపోవాలి" అని కలిసిపోయాం.

...

మరి ఇప్పుడు అదంతా నా ఒళ్లోనే ముగిసిపోయిందా? పిల్లలు, ప్రేమలు, బంధాలు అన్నీ నా ఒళ్లోనే రాలిపోయాయా? l l l పెద్దోడు విమానం ఎక్కాడట, రాత్రికి గానీ చేరడు. నేను ఇక ముందుకు నడవాలా, లేదా గత జ్ఞాపకాల్లోనే ఆగిపోవాలా? ఆ క్షణాన చుట్టూ ప్రశ్నలే! తల దగ్గర ఎవరో దీపం వెలిగిస్తున్నారు. ఇంకెవరో అగరొత్తుల కట్ట తెచ్చి, వెలిగించి నిలబెడుతున్నారు. పొగ ఆయన ముఖం మీదుగా పైకి లేస్తోంది. పండగ రోజు ఇంట్లో వచ్చే వాసన ఇది. ఆ వాసన ఇప్పుడు ఈ ముఖం దగ్గర! దీపం వెలుగులో ఆయన ముఖం ఇంకెవరిదోలాగా ఉంది. ఇన్నేళ్లు చూసిన ముఖమే, అయినా ఇంత దగ్గరగా ఎప్పుడూ చూడలేదనిపిస్తోంది. దీపంలో నూనె పోయాలని చేయి ముందుకు వెళ్తోంది. ఎవరో "వద్దులే" అంటున్నారు. చేయి వెనక్కి తీసుకుంటున్నాను. మళ్ళీ ఎవరో అంటున్నారు: "ఫ్రీజర్ పెట్టె వచ్చింది, పార్థివ దేహాన్ని తీసుకురండి." ఇప్పుడు తను కేవలం ఒక శవమా? నేను శవాన్ని ఒళ్లో పడుకోబెట్టుకున్నానా, లేదా మనిషే నా ఒళ్లో శవమై తేలాడా? ఇంతసేపూ ఒట్టి శవానికి ధూపం వేసిన అగరొత్తులు, ఇప్పుడు ఫ్రీజర్‌లో ఉన్న ఆ శవానికి సువాసనలు అంటిస్తున్నాయి.


సుధా మురళి

8309622246

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్