విజయవాడ లెనిన్ సెంటర్‌లో వామపక్షాల భారీ ధర్నా
ప్రజాశక్తి-ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి అక్రమాలు, దౌర్జన్యాలపై విజయవాడలోని లెనిన్ సెంటర్‌లో బుధవారం వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అధికార కూటమి దౌర్జన్యాలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని విమర్శించారు. ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడం, కిడ్నాప్‌లు, అక్రమ కేసులతో వేధించడం వంటి చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. కింది స్థాయి పోలీసు యంత్రాంగం అధికార పార్టీ ఏజెంట్లుగా వ్యవహరిస్తూ వామపక్ష కార్యకర్తలను గృహ నిర్బంధం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలను గృహ నిర్బంధంలో ఉంచి, అధికార పార్టీ నాయకులకు స్వేచ్ఛ కల్పించడం ఏ రకమైన ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు వినియోగించారని, మరోవైపు ఓట్ల తొలగింపునకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. అల్లూరి జిల్లాలో కూటమి ఓటమికి మతమార్పిడులే కారణమంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నమేనని హెచ్చరించారు. దౌర్జన్యాలకు పాల్పడి గెలిచిన తర్వాత 3.6 శాతం ఓట్లు అదనంగా సాధించామని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఇది ప్రజా తీర్పు కాదని, అధికార పార్టీకి, పోలీసు యంత్రాంగానికి అనుకూలంగా వెలువడిన తీర్పు మాత్రమేనని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన యంత్రాంగమంతా ఎన్నికల కమిషన్ పరిధిలోనే పనిచేయాలని, మంత్రుల జోక్యం ఉండకూడదని డిమాండ్ చేశారు. రాబోయే పంచాయతీ, 23 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని కోరారు.
జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ.. నామినేషన్ల దశ నుంచి ఓట్ల లెక్కింపు వరకు పోలీసు, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుని కూటమి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. 30 లక్షల మందికిపైగా ప్రజలను ఓటింగ్‌కు దూరం చేసి బలవంతపు ఏకగ్రీవాలు సాధించుకున్నారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కూటమి గెలిస్తే ప్రజాస్వామ్యం, ఇతర పార్టీలు గెలిస్తే మతమార్పిడులా? అని ప్రశ్నించారు. అధికారం కోసం మత విద్వేషాలను రెచ్చగొట్టడం తగదన్నారు. రాబోయే ఎన్నికలను సక్రమంగా నిర్వహించకపోతే ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అన్ని ప్రజాస్వామిక శక్తులను కలుపుకుని గ్రామస్థాయి నుంచి వీధి పోరాటాలు నిర్వహిస్తాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్. బాబురావు, విజయవాడ నగర కార్యదర్శి బి. రమణారావు, సిపిఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సిపిఐ, సిపిఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై నిరసన తెలిపారు.








కామెంట్‌లు (0)