- దొంగ ఓటు వేసిన ఎమ్మెల్యే పంచకర్లపై చర్యకు డిమాండ్
- పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించాలి
- సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు జగ్గునాయుడు, రెహ్మాన్
రాష్ట్రంలో కార్పొరేషన్, మున్సిపల్, జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ అక్రమాలను వ్యతిరేకిస్తూ సిపిఎం, సిపిఐ ఆధ్వర్యాన బుధవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు ఎం.జగ్గునాయుడు, ఎస్.కె.రహిమాన్ మాట్లాడుతూ, అక్రమాలకు పాల్పడిన కూటమి ప్రభుత్వంలోని టిడిపి, జనసేన, బిజెపికి చెందిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయనీకుండా అడ్డుకొని, రిగ్గింగ్ చేసిన వారిపై కేసులు నమోదుచేయాలన్నారు. ప్రజాస్వామిక సూత్రాలను చంద్రబాబు వల్లెవేస్తూ డబ్బులు పంపిణీచేసి ప్రజాస్వామిక విలువలను నాశనం చేశారని విమర్శించారు. సుపరిపాలన, అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేస్తారని చెప్పిన కూటమి ప్రభుత్వం, ఎన్నికల్లో డబ్బులు ఎందుకు పంపిణీ చేసిందని ప్రశ్నించారు. ఎన్నికల్లో ధన ప్రవాహం ఉండకూడదని, రూ.500 నోట్లు రద్దుచేయాలని చెప్పి ఓట్లకు నోట్లు కూటమి నాయకులు పంచారని తెలిపారు. గత ప్రభుత్వం రిగ్గింగ్ చేసిందని మాట్లాడిన చంద్రబాబు, తాను అధికారంలోకి వచ్చాక అవే అక్రమ పద్ధతులు అనుసరించారని విమర్శించారు. పోలీసును అడ్డుపెట్టుకొని గెలవడం, ఓటమి తప్ప గెలుపుకాదన్నారు. రాష్ట్రంలో అనేకచోట్ల అభ్యర్థులను కిడ్నాప్ చేయడం, బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించుకొనేలా చేయడం ప్రజాస్వామ్యానికి విఘాతమన్నారు. ధనబలంతో రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమన్నారు. పంచాయతీ ఎన్నికలైనా స్వేచ్ఛగా జరిగేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు.
నగరంలోని పెందుర్తి జోన్ 115వ వార్డులో ఓటు లేకుండా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఓటెలా వేశారని ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని లేనిచోట ఓటు వేయడం దొంగ ఓటు కాదా? అని నిలదీశారు. తక్షణమే పంచకర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు. పంచకర్లపై ఎన్నికల కమిషనర్, కలెక్టర్ చట్టపరమైన కేసు నమోదుచేయకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్కెఎస్వి.కుమార్, జిల్లా కమిటీ సభ్యులు బి.ఈశ్వరమ్మ, ఆర్.లక్ష్మణమూర్తి, వి.నరేంద్ర, యుఎస్ఎన్ రాజు, ఎల్జె.నాయుడు, సిపిఐ జిల్లా నాయకులు ఎం.పైడిరాజు, పి.చంద్రశేఖర్, ఎం.మన్మధరావు, పి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)