------
ప్రజాశక్తి శింగనమల
అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నార్పల మండలం బి.పప్పూరు గ్రామానికి చెందిన విద్యార్థిని వసంతను బుధవారం ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతపురం జేఎన్టీయూ సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ ఉమెన్స్ కళాశాలలో బి.ఎ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వసంత కళాశాల రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ఆమె ప్రస్తుతం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆసుపత్రికి వెళ్లి వసంతను పరామర్శించి ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అలాగే ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైన అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని వైద్యులు, జిల్లా వైద్యాధికారులను కోరారు. ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. వసంత త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విద్యాభ్యాసం కొనసాగించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.







కామెంట్‌లు (0)