ప్రజాశక్తి - కడియం
ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్‌ల వ్యవహారంలో జరిగిన ఘర్షణ ఒక మైనర్ బాలుడి ప్రాణం తీసింది. బాలిక తండ్రి, మరో ఇద్దరు బంధువులను నిందితులుగా మార్చింది. కడియం పోలీస్ స్టేషన్ పరిధిలోని వేమగిరి గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వేమగిరి గ్రామానికి చెందిన వాసంశెట్టి కార్తీక్ (16) అనే మైనర్ బాలుడు, అదే గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలికతో ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేశాడు. బాలికతో చాటింగ్ చేయడాన్ని గమనించిన ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. బాలిక తండ్రి కాకి నాగనరేంద్ర, తాతయ్య కాకి నాగేశ్వరరావు, చిన తాతయ్య మట్టపర్తి అర్జునరావు కలిసి బాలుడిపై దాడికి దిగారు. ఈ దాడిలో ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతి చెందిన బాలుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కడియం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కేసు దర్యాప్తులో ఉందని కడియం సిఐ అల్లు వెంకటేశ్వరరావు తెలిపారు.







కామెంట్‌లు (0)