ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

26న రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు

1 రోజు క్రితం

26న రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు
- డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో దేశవ్యాప్త జైల్‌భరో
- సిపిఐ జాతీయ నాయకులు కె.రామకృష్ణ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 08:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో దేశవ్యాప్త జైల్‌భరో

- సిపిఐ జాతీయ నాయకులు కె.రామకృష్ణ

ప్రజాశక్తి - కర్నూలు కార్పొరేషన్‌ : ఈ నెల 26వ తేదీని రాజ్యాంగ పరిరక్షణ దినంగా పాటిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించాలని, డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో దేశవ్యాప్త జైల్‌భరో కార్యక్రమాలు చేపట్టాలని సిపిఐ జాతీయ నాయకులు కె.రామకృష్ణ కోరారు. కర్నూలులోని సిఆర్ భవన్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనలో కార్మికులకు వేతనాలు పెంచలేదని, యువతకు ఉపాధి కల్పించలేదని విమర్శించారు. ఈ విషయాలను గతంలో వామపక్షాలు ప్రస్తావిస్తే తమ నాయకులను అర్బన్ నక్సలైట్లుగా ముద్రవేశారన్నారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, పోర్టులు, గనులు, భూములను కొద్దిమంది కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని, నిరుద్యోగం పెరుగుతోందని, పరీక్షల నిర్వహణలోనూ అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని విమర్శించారు. బియ్యం, పప్పులు, నూనెల ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గతంలో స్థానిక ఎన్నికల తీరును విమర్శించిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు అదే తరహా చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రతిపక్ష అభ్యర్థులను పోటీ నుంచి తప్పుకునేలా బెదిరిస్తున్నారని, ఏకగ్రీవాల కోసం ఒత్తిళ్లు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిచిన అభ్యర్థులకు కాకుండా ఓడిపోయిన టిడిపి కూటమి అభ్యర్థులకు డిక్లరేషన్లు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజాస్వామికవాదులను సమీకరించి ఉద్యమిస్తామన్నారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవుల శేఖర్, జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్.మునెప్ప, నక్కి లెనిన్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్