సీడ్ యాక్సెస్ ఇ-3 రోడ్‌ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రజాశక్తి - గుంటూరు జిల్లా ప్రతినిధి : సీడ్ యాక్సిస్ రోడ్డు ద్వారా విజయవాడ, తాడేపల్లి నుంచి నేరుగా రాజధానికి వెళ్లేందుకు రహదారి సిద్ధమైంది. రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలకంగా మారిన ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్, బకింగ్‌హామ్ కెనాల్‌పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించనున్నారు. కరకట్ట రోడ్డుపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గిస్తూ.. వాహనాలు సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా నేరుగా అమరావతికి చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచస్థాయి ప్రమాణాలతో గ్రిడ్ తరహాలో అభివృద్ధి చేస్తున్న అమరావతి రాజధాని రహదారుల నిర్మాణానికి ఈ ప్రాజెక్టు కీలక ముందడుగుగా నిలవనుంది. రూ.1,519 కోట్లతో 21.77 కి.మీ దొండపాడు నుంచి ప్రారంభమయ్యే ఇ-3 రోడ్డు.. రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి మీదుగా మణిపాల్ హాస్పిటల్స్ వద్ద జాతీయ రహదారి-16ను కలుపుతుంది. 21.77 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి నిర్మాణానికి రూ.1,519 కోట్లు వెచ్చించారు. 60 మీటర్ల వెడల్పుతో మూడు దశల్లో నిర్మిస్తున్న ఈ కారిడార్‌లో తొమ్మిది లైన్ల రహదారి, ప్రత్యేక బిఆర్‌టిఎస్ కారిడార్, సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయనున్నారు. డ్రైనేజీ, మంచినీటి సరఫరా, గ్యాస్, విద్యుత్ నెట్‌వర్క్‌లకు అవసరమైన మౌలిక వసతులను కూడా రహదారి నిర్మాణంతో పాటే కల్పించనున్నారు. సైకిల్ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌లు, గ్రీన్‌బెల్ట్‌లతో ఇ-3ను ఆధునిక నగర రహదారిగా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. గురువారం ఉదయం 10.20 గంటలకు సిఎం చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి 10.30 గంటలకు ఉండవల్లి స్టీల్ బ్రిడ్జి వద్దకు చేరుకుంటారు. 10.35 గంటలకు శిలాఫలకం ఆవిష్కరిస్తారు. 10.45 గంటలకు ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు గుండా ప్రయాణించి రాయపూడికి చేరుకుని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గృహ సముదాయాలను పరిశీలిస్తారు. సంబంధిత పత్రాలను జిఏడికి అప్పగిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.








కామెంట్‌లు (0)